యూఏఈకి వెళ్లే విమానాలకు డెల్టా ప్లస్‌ బ్రేక్‌

28 Jun, 2021 08:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భారత్‌తోపాటు మరో 13 దేశాల సర్వీసులపై నిషేధం పొడిగింపు.. 

జూలై 21 వరకు ఆంక్షలు

మోర్తాడ్‌ (బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి వెళ్లే విమానాలకు కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ బ్రేక్‌ వేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ నుంచి వచ్చే విమాన సర్వీసులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. వాస్తవానికి జూలై 7 నుంచి భారత విమాన సర్వీసుల రాకపోకలకు యూఏఈ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వెలుగు చూడడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో పాటు మరో 13 దేశాల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. జూలై 21 వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమైన నేపథ్యంలో ఏప్రిల్‌ 25 నుంచి మన దేశ విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం విధించింది. ఇటీవల కేసులు తగ్గడంతో భారత విమాన సర్వీసులకు ఆహ్వానం పలికింది. రెండు డోస్‌ల కోవిషీల్డు టీకా తీసుకోవడంతో పాటు ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు పొందిన వారికి యూఏఈలో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వనున్నట్లు జనరల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రకటించింది. దీంతో యూఏఈలోని వివిధ కంపెనీల్లో పని చేస్తూ సెలవులపై వచ్చిన వారు, కొత్తగా వీసాలను పొందిన వారు అక్కడకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో డెల్టా ప్లస్‌ మళ్లీ బ్రేక్‌ వేసింది. 


 

మరిన్ని వార్తలు