వలసదారులకు యూఏఈ ప్రభుత్వం ఖుషీ ఖబర్‌.. స్పాన్సర్‌ లేకుండా సొంతంగా వ్యాపారం

5 Oct, 2022 00:54 IST|Sakshi

వీసా నిబంధనలు సవరించిన యూఏఈ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వ నిర్ణయం.. 

వలసదారులకు ఖుషీ ఖబర్‌

మోర్తాడ్‌ (బాల్కొండ): విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం ఖుషీ ఖబర్‌ అందించింది. వీసా నిబంధనలను సవరిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆ దేశానికి వెళుతున్న వలసదారులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి, అజ్మన్, షార్జా తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశానికి చెందిన వారి ద్వారానే లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది.

ఇలా స్పాన్సర్‌ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే 51 శాతం స్పాన్సర్‌ పెట్టుబడి, మిగిలిన 49 శాతం వలసదారుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పాన్సర్‌ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా వలసదారుడే మొత్తం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటాను పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పాన్సర్‌తో సంబంధం లేకుండా యూఏఈ ప్రభుత్వం అనుమతితో ఎవరైనా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

విజిట్‌ వీసా గడువు 60 రోజులకు పెంపు
విజిట్‌ వీసా కాలపరిమితి 30 రోజులే ఉండగా ఇప్పుడు 60 రోజులకు పెంచారు. అనుకోని సందర్భంలో ఉద్యోగం కోల్పోయినవారు వెంటనే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు అక్కడే ఉండి మరో కంపెనీలో పని వెతుక్కుని వీసాను రెన్యువల్‌ చేసుకోవచ్చు. గతంలో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంటికి రావడం లేదా కార్మికునిగా ఉండిపోయి పోలీసులకు దొరికితే కటకటాల పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ టూరిస్ట్‌ వీసా ఉన్నవారు వరుసగా మూడు నెలల పాటు యూఏఈలో ఉండవచ్చు. గ్రీన్‌ వీసా పొందినవారు తమకు ఉన్న పర్మిట్‌ పూర్తయితే రెన్యువల్‌ చేసుకోవడానికి ఆరు నెలల గడువును పొడిగించారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనెల 3 నుంచి అమలులోకి వచ్చింది. యూఏఈకి వలస వెళుతున్న వారిలో భారతీయుల సంఖ్యనే అధికంగా ఉండటంతో వీసా నిబంధనల సవరణ ప్రయోజనాలు ఎక్కువ శాతం మనవారికే కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మరిన్ని వార్తలు