అందరినీ ఆదుకుంటాం

26 Jul, 2021 02:45 IST|Sakshi
చిప్లున్‌ పర్యటనలో భాగంగా అక్కడి సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో మాట్లాడుతున్న సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

బాధితులందరికీ ఆర్థిక సాయం అందజేస్తాం 

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ 

చిప్లూన్‌లో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు 

తలియేలో కేంద్రమంత్రి, బీజేపీ నేతల పర్యటన 

సాక్షి, ముంబై: ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హామీ ఇచ్చారు. బాధితులందరికి వెంటనే ఆర్థిక సాయం ప్రకటించి, దాన్ని అమలు చేయడంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన గ్రామాల్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం పర్యటించారు. చిప్లూన్‌లో వరదకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, వ్యాపారస్తులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు.

వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింధుదుర్గ్, రత్నగిరి, రాయ్‌గఢ్, సాతారా, సాంగ్లీ, కొల్హాపూర్‌ జిల్లాల్లో జరిగిన నష్టంపై పంచనామా నిర్వహించి ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేస్తామన్నారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, రీజినల్‌ కమిషనర్‌లకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక రాగానే బాధితులు అందరికి ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆలోపు తాత్కాలికంగా తక్షణమే కొంత ఆర్థిక సాయం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ‘అనేక చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పంటలు, తోటలకు అపార నష్టం జరిగింది.

బాధితులు అందరికీ సాధ్యమైనంత త్వరగా ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తాం’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితులు అందరికీ బియ్యం, గోధుమలు, కిరోసిన్, ఇతర వంట సామగ్రి, దుస్తులు పంపిణీచేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కేవలం పబ్లిసిటీ కోసం ఆదరా బాదరగా ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కూడా ఎంత మేర సాయం కోరాలా అనేది త్వరలో నిశ్చయిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని చెప్పారు. గతంలో వరద, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.

కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు. అందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అందరికీ ఆర్థిక సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. కరోనా వల్ల ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం ఉంటుందని తెలిపారు. రక్షణ బలగాలకు చెందిన కొన్ని బృందాలను పంపి కేంద్రం సాయం చేసిందన్నారు. సోమవారం తాను పశ్చిమ మహారాష్ట్రలో పర్యటిస్తానని, జరిగిన నష్టంపై నివేదిక తయారుచేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, అంతకుముందు చిప్లూన్‌ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని స్థానికులు అడ్డుకున్నారు. వర్షాల వల్ల తాము ఎదుర్కొంటున్న నరకయాతనను వారు ముఖ్యమంత్రికి వివరించారు. తమకు తక్షణమే సాయం అందించాలని వేడుకున్నారు.

మరిన్ని వార్తలు