భారతీయ విద్యార్ధుల్లో... అమెరికా క్రేజ్‌ తగ్గింది!

14 Aug, 2022 18:53 IST|Sakshi

ఉన్నత విద్యార్జనకు సంబంధించి ప్రస్తుతం బారతీయ విద్యార్ధుల్లో  అమెరికాపై ఉన్న అధిక ఆసక్తి తగ్గుముఖం పట్టిందని ప్రముఖ యుకె వర్సిటీ అసెక్స్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ వల్ల విదేశీ విద్యావకాశాలు మరింతగా భారతీయులకు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్‌లో ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన యుకెలోని ప్రతిష్ఠాత్మక  ఎసెక్స్‌ వర్సిటీ హైదరాబాద్‌కు చెంది ఉస్మానియా విశ్వవిద్యాలయంతో తొలి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో నగరానికి వచ్చిన ఎసెక్స్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ వెనెస్సా పోట్టెర్, భారతీయ ప్రతినిధి సందీప్‌ శర్మ, లు ‘సాక్షి’తో ముచ్చటించారు. వారు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే...

అరవైఏళ్ల...వర్సిటీ మాది...
యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీ మా ఎసెక్స్‌. దీనిని 1964లో తొలి ఏడాది 122 మంది విద్యార్ధులతో ప్రారంభించగా ఇప్పుడు 17వేల మందికి చేరింది. యూనివర్సిటీ 3 క్యాంపస్‌లను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన విద్యార్ధులు చదువుతున్నారు. పూర్వ విద్యార్ధుల అలుమ్ని సంఖ్య దాదాపుగా 1లక్షకుపైనే ఉంది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యకేషన్‌ అవార్డ్స్‌లో యూనివర్సిటి ఆఫ్‌ ద ఇయర్‌గా, అలాగే  రిసెర్చ్‌ క్వాలిటీ పరంగా టాప్‌ 25లోనూ ఉంది.

2వేల మంది భారతీయ విద్యార్ధులే లక్ష్యం...
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న సమయంలో, మా పబ్లిక్‌ రీసెర్చ్‌ విశ్వవిద్యాలయం ఒక దశాబ్దానికి పైగా భారత్‌లో కార్యాలయాన్ని కలిగి ఉంది. అలాగే పరిశోధనా రంగంలో మా విజయాలే పునాదిగా 2022–2023 విద్యా సంవత్సరంలో మేం 2,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

అదే విధంగా మేం అందించే స్కాలర్‌షిప్‌ల శ్రేణి కూడా అత్యంత ఆకర్షణీయమైన అంశం.  కంప్యూటర్‌సైన్స్, బిజినెస్‌ ఇంజనీరింగ్‌ కోర్సుకి ఇండియా నుంచి  బాగా డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది ఇక్కడ నుంచి 2వేల మంది విద్యార్ధుల్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఏ యూనివర్సిటీలో అయినా స్కాలర్‌షిప్స్‌ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎసెక్స్‌లో అర్హతను బట్టి వర్సిటీ నుంచి అది మంజూరైపోతుంది.

జాతీయ విద్యా విధానంతో మేలు...
జాతీయ విద్యా విధానాన్ని  స్వాగతిస్తున్నాము  ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. జాతీయ విద్యా విధానం అంతర్జాతీయ విద్యావకాశాలను మరింత విస్త్రుతం చేస్తుంది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా  భారతదేశంలో పదేళ్లుగా ఉనికిని కలిగి ఉన్న ఎసెక్స్‌కు బాగా ప్రయోజనకరం.

ఈ విద్యా విధానం   భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తుంది. ఇందుకు అనుగుణంగా మేం ఇప్పటికే గుజరాత్‌లోని  సంస్థలతో మాట్లాడుతున్నాము. కోవిడ్‌.. మాకు ట్రాన్స్‌నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాట్ల పరంగా సృజనాత్మక అవకాశాలను అందించింది. .

ఉస్మానియా...మా తొలి భాగస్వామి...
ఇండియాలో ఇప్పటికి 19 భాగస్వాములను ఏర్పరచుకున్నాం.  తెలంగాణలోని ప్రతిష్టాత్మక  ఉస్మానియా యూనివర్సిటీతో తొలి ఒప్పందం కలిగి ఉన్నాం. మరిన్ని కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ తరహా భాగస్వామ్యాల్లో బాగా అనుభవం ఉన్నవి కొన్నే కాబట్టి భాగస్వామ్యాలలు నెలకొల్పడానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటున్నాం.  

మా భాగస్వాముల కోసం విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉమ్మడి పీహెచ్‌డీ పర్యవేక్షణ, ఉమ్మడి బోధన  మరెన్నో  రకాల భాగస్వామ్యాల పోర్ట్‌ఫోలియో మా స్వంతం. ఇక సృజనాత్మక కార్యక్రమాల జాబితాకు అంతేలేదు.  చాలా వరకూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భాగస్వాముల ప్రయోజనాల గురించి ఆలోచన లేకుండా తెలివైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. కానీ మేం  పరస్పర ప్రయోజనాలను కోరుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మేలు కలిగించే భాగస్వామ్యాలను కోరుకుంటున్నాము.

హైదరాబాద్‌ మాకు చాలా ముఖ్యమైన నగరం...
చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన భాగస్వామిగా హైదరాబాద్‌ను పరిగణిస్తాం. సంప్రదాయంగా చూస్తే హైదరాబాద్‌  నగరం నుంచి అమెరికాకు ఎక్కువ దరఖాస్తులు వెళతాయి. అయితే గత మూడేళ్లుగా ఇది మారింది. ఇటీవల ఆ క్రేజ్‌ యుఎస్‌ నుంచి యుకెకు బదిలీ అయింది. మాకు వచ్చే దరఖాస్తుల సంఖ్యలో 200శాతం పెరుగుదల ఉంది.  

తెలంగాణ నుంచే కాకుండా భారత్‌ నుంచి మాకు వస్తున్న విద్యార్ధుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, కంప్యూటర్‌సైన్స్,  డేటా సైన్స్‌... వంటివి ఎంచుకునేవారు ఎక్కువగా ఉన్నారు. ఒకేసారి 2 సబ్జెక్ట్స్‌ కలిసి చదవడం అనే ట్రెండ్‌ని వీరు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్‌ విత్‌ కంప్యూటర్‌ సైన్స్, ఎకనామిక్స్‌ విత్‌ కంప్యూటర్‌ సైన్స్‌.. ఇలా కలిపి చదువుతున్నారు.

(చదవండి: బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు నరసింహ.. సత్తయ్య..)

మరిన్ని వార్తలు