Telangana: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. 20% బస్సులు డిపోల్లోనే!

3 Mar, 2022 19:19 IST|Sakshi

అసాధారణంగా పెరిగిన డీజిల్‌ ధరలతో ఆర్టీసీ బెంబేలు 

20% తగ్గించి బస్సులను డిపోల్లోనే ఉంచాలనుకుంటున్న సంస్థ  

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. నేరుగా జనం జేబుపైనే భారం! 

సాక్షి, హైదరాబాద్‌: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పెరిగిన ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సుల ట్రిప్పులు కుదించుకోవాలని ఆలోచిస్తోంది. కనీసం 20 శాతం ట్రిప్పులు తగ్గించి ఆ మేరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలనుకుంటోంది.  

కుదుటపడుతున్న సమయంలో.. 
కోవిడ్‌ వల్ల గత రెండేళ్లుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో ట్రిప్పులు తిప్పలేకపోతోంది. ఇప్పుడిప్పుడే అన్ని బస్సులు ఊళ్లకు వెళ్తున్నాయి. పరిస్థితి క్రమంగా కుదుటపడుతుందని అనుకుంటున్న సమయంలో తాజా ‘డీజిల్‌ సంక్షోభం’ఆర్టీసీని మళ్లీ సమస్యల్లోకి నెట్టింది. ఆర్టీసీ నిత్యం సగటున 5 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీ కొనే బల్క్‌ డీజిల్‌ లీటరు ధర రూ.92గా ఉంది. తర్వాతి రోజే అది రూ. 6 మేర పెరిగింది. దీంతో అంతకంటే తక్కువ ధర ఉన్న రీటైల్‌లో కొనటం ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ముగుస్తూనే రిటైల్‌లోనూ రేట్లు పెరగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బల్క్‌ డీజిల్‌ లీటరు ధర రూ.104కు చేరింది. యూపీ ఎన్నికలు ముగిసేనాటికి నాటికి రేటు రూ. 110ని మించుతుందని, ఆర్టీసీకి బల్క్‌ పర్చేస్‌ డిస్కౌంట్‌తో కలుపుకుంటే అది రూ.105 కంటే ఎక్కువే ఉంటుందని ఆర్టీసీ అంచనా. అదే జరిగితే రోజువారీగా అదనంగా రూ.65 లక్షల భారం ఆర్టీసీపై పడుతుంది. దీన్ని భరించటం అసాధ్యమని సంస్థ చెబుతోంది. అందుకే కనీసం 20 శాతం ట్రిప్పులను, ఆ మేరకు ఖర్చులను తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది.  

చదవండి: (గుడ్‌న్యూస్‌: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం)

పెళ్లిళ్లూ లేకపోవడంతో.. 
సాధారణంగా ఆర్టీసీకి పెళ్లిళ్ల సీజన్‌లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు కూడా విరామం వచ్చింది. మరో 20 రోజులు ముహూర్తాల్లేవు. శుభముహూర్తాలు లేకుంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతుంది. బుధవారం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోనే నమోదైంది. ఇది ఇంకా తగ్గే అవకాశముంది. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోను చూపి ట్రిప్పులను తగ్గించి అంతమేర బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. 

నేరుగా జనంపై డీజిల్‌ భారం 
చాలినన్ని బస్సుల్లేక, కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేక పాత బస్సులనే ఆర్టీసీ నడుపుతోంది. వేల సంఖ్యలోని ఊళ్లకు రవాణా వసతిని అందించలేకపోతోంది. దీంతో జనం ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. డీజిల్‌ ధర పెరగటంతో ఆటో చార్జీలూ భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ట్రిప్పులూ తగ్గితే, బస్సుల్లేవని ఆటోవాలాలు చార్జీలు పెంచే అవకాశం ఉంది. దీంతో డీజిల్‌ భారం నేరుగా జనం జేబుపై పడబోతోంది. 

మరిన్ని వార్తలు