అయ్యో రాములు.. గిట్లయితే ఎట్ల! కొమ్మ విరగాల్నా? కాయ రాలాల్నా?

5 May, 2022 21:31 IST|Sakshi

కొమ్మ విరిగితేనే.. కాయ రాలితేనే

మామిడి నష్టానికి నిబంధనల గుదిబండ

అసలే కాత లేక మామిడి రైతు కుదేల్‌

అరకొర కాత నేల పాలు


ఈ రైతు రాములు. కోహెడలో 6 ఎకరాల మామిడి తోట ఉండగా మరో ఐదున్నర ఎకరాల తోట లీజుకు తీసుకున్నాడు. లక్షా70వేలు లీజు కాగా అతని తోటకు 2లక్షల వరకు లీజు వస్తుంది. ఈ లెక్కన 3.70లక్షలు లీజుకే ఖర్చు కాగా 5టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కిలో రూ.45 లెక్క కట్టగా రూ.2.25లక్షలే వచ్చింది. అంటే లీజు ఖర్చే రాలేదు. మరో టన్ను వరకు వస్తుందనుకున్నా కాత ఈదురుగాలులతో నేలరాలింది. ముందే మంచు తేనె రోగం ముంచగా నష్టం తీవ్రంగా ఉందని ఉద్యానఅధికారులను కలిస్తే వారు చెప్పిన నిబంధనలతో నిరాశగా వెనుదిరిగాడు.

కరీంనగర్‌ అర్బన్‌: ఇది కేవలం రాములు సమస్యే కాదు జిల్లాలో వేలమంది రైతులది ఇదే పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది నష్టపరిహారం పరిస్థితి. అసలే మంచు తేనే నిండా ముంచగా వచ్చిన అరకొర మామిడి కాయలను ఈదురుగాలులు నేలపాలుచేశాయి. ఎన్నడూ లేనివిధంగా పూత తగ్గగా దిగుబడిపై దిగులు పడ్డ రైతన్నకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కనీసం ప్రభుత్వం నుంచి నష్టపరిహారమైనా వస్తుందని ఆశిస్తే నిబంధనలు కొరకరాని కొయ్యగా మారాయి. 33శాతం నష్టం నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది.

33శాతం నష్టం జరగాలంటే కొమ్మలు విరగాలట.. కాయలు రాలాలట. అరకొర కాత రాలితే నష్టం జరిగినట్లు కాదట. గతంలో 50శాతం పంట నష్టం జరిగితే పరిహారానికి అర్హులుగా పరిగణించేవారు. ఒక రైతుకు ఎకరం మామిడి తోట ఉంటే అందులో 50శాతం నష్టపోయి ఉండాలి. అంటే కూకటి వేళ్లతో చెట్లు కూలడం, కొమ్మలు విరగడం, కాయలు సగానికి పైగా రాలితే పరిహారం దక్కేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం నుంచి 33శాతానికి తగ్గించింది. అరకొర పండిన పంటను విక్రయించాలంటే ధర కిలో రూ.40–50మాత్రమే పలుకుతోంది.

వేయి హెక్టార్లలో దెబ్బతిన్న తోటలు
ఇటీవల పలుమార్లు వీచిన బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన మామిడితోటలను కోలుకోని దెబ్బతీశాయి. జిల్లాలో 2600 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఈ సారి అరకొరగా 8,200 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మంచు తేనె తెగులుతో పాటు పూత లేకపోవడం, దిగుబడి చేతికందే సమయంలో ప్రకృతిలో మార్పుల కారణంగా ఈదురుగాలులతో వానతో తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన బలమైన గాలులతో వేయి హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్‌ మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, కొత్తపల్లి, గంగాధర, వీణవంక మండలాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు గుర్తించినప్పటికి నిబంధనలు గుదిబండగా మారాయి.

ధర అంతంతే
కరోనా వైరస్‌ ప్రభావంతో గత 2020 నుంచి రైతులకు నష్టాలే. 2020కి ముందు కిలో రూ.50–60 పలికిన ధర ప్రస్తుతం రూ.40–50కి మించడం లేదు. కరోనా క్రమంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్లో పండ్ల వ్యాపారాన్ని నిలిపివేయగా బొమ్మకల్‌ బైపాస్‌లో ఏర్పాటు చేశారు. ఈ సారి నుంచే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాగ్‌పూర్, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి తరలించడం జరిగే ప్రక్రియ. కానీ కాత తక్కువగా ఉండటంతో అరకొర వ్యాపారులు వస్తుండగా ధర సగానికే పరిమితమైంది.

రైతులకు నష్టం
ఎన్నడూ లేనంతగా ఈ సారి మామిడి రైతులకు నష్టం జరిగింది. గతంలో మామిడి కాయలతో మార్కెట్‌ కళకళలాడేది. గతానికి పోల్చితే పావు వంతు కూడ మార్కెట్‌ లేదు. ధర ఉన్నా కాయ లేకపోవడం తీరని నష్టం. 
– నిమ్మకాయల పాషా, వ్యాపారి

ప్రభుత్వం ఆదుకోవాలి
ఎపుడైనా పూతను బట్టి తోటలను పడుతాం. కానీ ఈ సారి నష్టాలే తప్ప లాభం లేదు. ఇందుర్తిలో రూ.2లక్షలు పెట్టి 6ఎకరాల తోట పట్టిన. 2 టన్నులు కూడ రాలే. రూ.80వేలు వచ్చినయి. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– గంట సమ్మయ్య, కౌలుదారు, ఇందుర్తి

మరిన్ని వార్తలు