గ్రేటర్‌ హైదరాబా‍ద్‌లో భూగర్భ మెట్రో కథ కంచికేనా..?

7 Mar, 2022 13:55 IST|Sakshi

శంషాబాద్‌ సమీపం నుంచి ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ వరకు ప్రణాళిక..

సుమారు 3 కి.మీ రూట్లో అండర్‌ గ్రౌండ్‌ మెట్రో ఏర్పాటుకు నిర్ణయం..

కాగితాలపైనే రాయదుర్గం–శంషాబాద్‌ విమానాశ్రయం మెట్రో ప్రాజెక్టు..  

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరం లండన్‌.. మన దేశంలోని కోల్‌కతా తరహాలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోనూ భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని మూడేళ్లక్రితం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్‌ రూట్లో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విదితమే.   

ఇదీ అండర్‌గ్రౌండ్‌ మెట్రో ప్లాన్‌.. 
రాయదుర్గం–శంషాబాద్‌ మార్గంలో 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయాల్సిన రూట్లో కేవలం 3 కి.మీ. మార్గంలో... శంషాబాద్‌ టౌన్‌ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్‌ వరకు భూగర్భ మెట్రో ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించింది. విమానాల ల్యాండింగ్‌.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించడం విశేషం. కాగా ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించి మూడేళ్లు గడిచినా అడుగు ముందుకుపడడంలేదు. ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా..? మొదటి దశ తరహాలో పబ్లిక్‌ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందా అన్న అంశంపై సస్పెన్స్‌ వీడడం లేదు.  (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..)

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఏర్పాటుతో ఉపయోగాలివే.. 
► రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ వి మానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది.  

► కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ను డిజైన్‌ చేశారు.  

► ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసింది.  సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్‌ ఏర్పాటుతో గ్రేటర్‌ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు అవస్థలుండవు.

► ఈరూట్లో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.

► స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

► మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్‌పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో  ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. స్థలపరిశీలన కూడా పూర్తైంది. (క్లిక్‌: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్‌ఎంసీ!)

మరిన్ని వార్తలు