ఉపాధి ఊడుతోంది!

12 Aug, 2020 06:02 IST|Sakshi

కోవిడ్‌–19 ప్రభావంతో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోత 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగ రేటు 

జనవరిలో 5.5 శాతం ఉండగా.. జూలైలో 9.1 శాతానికి పెరుగుదల 

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 ధాటికి ఉపాధి రంగం విలవిలలాడుతోంది. లాక్‌డౌన్, అనంతర పరిణామాలతో నిరుద్యోగం క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండు నెలల లాక్‌డౌన్‌ కారణంగా మెజార్టీ రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సడలింపులు ఇస్తున్నప్పటికీ మునుపటి ఉత్సహం కనిపించడంలేదు. దీంతో అన్ని రంగాల్లోనూ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు పెరుగుతుండడంతో ఆ మేరకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఫలితంగా నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటుపై సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఈఐ) గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తోంది.

ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అంచనా వేయగా.. రాష్ట్రంలో నిరుద్యోగులు దాదా పు రెట్టింపైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనవరిలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 9.1శాతానికి పెరిగింది. ఇదే జాతీయస్థాయిలో 7.4 శాతంగా ఉన్నట్లు సీఎంఈఐ తెలిపింది. నిరుద్యోగ రేటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 1,74,405 కుటుంబాలను సర్వేలో నమూనాలుగా సేకరించారు. ఫోన్, ఆన్‌లైన్‌ తదితర మార్గా ల్లో సీఎంఈఐ ప్రతినిధులు వారితో మాట్లాడారు. గత నాలుగు నెలలుగా ఈ పద్ధతిలో సర్వే చేశారు.  

మేలో అత్యధికంగా.. 
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటు ఏప్రిల్, మే నెలల్లో నమోదైంది. లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. కొన్నింటికి అనుమతులిచ్చినప్పటికీ కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఈ క్రమంలో రోజువారీ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. అసంఘటిత రంగంలో అత్యధిక కార్మికులుండగా.. ఏప్రిల్, మే నెలల్లో వారికి పని దొరకలేదు. ప్రభుత్వం లేదా ఇతర దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోజులు వెళ్లదీసిన కుటుంబాలు అనేకం ఉన్నాయి.

ఈ రెండు నెలల్లో వరుసగా జాతీయ స్థాయిలో 23.5 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. అనంతరం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో క్రమంగా రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరుద్యోగ రేటు జూన్‌లో 11 శాతానికి, జూలైలో 7.4 శాతానికి తగ్గింది. ఇందులో పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ రేటు 9.15 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో మాత్రం 6.66 శాతంగా ఉన్నట్లు సీఎంఈఐ వివరించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగాయి. మేలో తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా వ్యవసాయ పనులు, ఉపాధి హామీ మందగించాయి. దీంతో ఆ నెలలో రాష్ట్రంలో నిరుద్యోగరేటు ఏకంగా 34.8 శాతం నమోదైంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు