యునెస్కోను మెప్పించాలి

29 Jul, 2021 00:44 IST|Sakshi

డిసెంబర్‌లోగా ‘రామప్ప’ సంరక్షణ చర్యలు చేపట్టాలి: హైకోర్టు

పూర్తిస్థాయి గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలి

4 వారాల్లో సర్వే చేసి ప్రణాళికలు రూపొందించాలని సర్కారుకు ఆదేశం

27 చారిత్రక కట్టడాలనూ..
చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు రాష్ట్రంలోని 27 పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు 4 వారాల్లో రూపొందించాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై పలు సూచలను చేసిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు.

సాక్షి, హైదరాబాద్‌: ‘చారిత్రక వారసత్వసంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక శిల్పకళా సంపద కల్గిన రామప్ప ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక ప్రాతిపదికన హెరిటేజ్‌ కేంద్రంగా ఎంపిక చేసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కో అధికారులను మెప్పించాలి. వారి అంచనాల మేరకు డిసెంబర్‌లోగా ఈ క్షేత్రం సంరక్షణకు చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హెరిటేజ్‌ కేంద్రంగా గుర్తింపు సాధించాలి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ఆలయానికి యునెస్కో తాత్కాలిక గుర్తింపు లభించడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించి బుధవారం విచారించింది. 

ఆగస్టు 4న ఏఎస్‌ఐ, కలెక్టర్‌ సమావేశమవ్వాలి
‘ఇదొక అద్భుతమైన, బంగారం లాంటి అవకాశం. రామప్ప ఆలయ సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. దీనిని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ విడిది సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ), రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, హెరిటేజ్‌ విభాగం, జిల్లా కలెక్టర్‌ సమన్వయంతో పనిచేయాలి. ఆగస్టు 4న ఈ నాలుగు విభాగాల అధికారులు సమావేశం కావాలి. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రామప్ప ఆలయ అభివృద్ధికి బ్లూప్రింట్‌ రూపొందించాలి. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. పనుల పర్యవేక్షణకు నోడల్‌ అధికారిని నియమించుకోవాలి. యునెస్కో అంచనాల మేరకు అధికారులు పనిచేయక, గుర్తింపు వెనక్కు పోయే పరిస్థితి వస్తే మాత్రం దేశమంతా నిందిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను మేమే పర్యవేక్షిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేసింది.  

>
మరిన్ని వార్తలు