3 కోట్ల 65 లక్షలతో కార్మికులకు యూనిఫాం

3 Oct, 2020 19:46 IST|Sakshi

4 కొత్త మైనింగ్‌ ప్లానులకు ఆమోదం

3వ దశ సోలార్‌ ప్లాంటుల నిర్మాణ కాంట్రాక్టులకు బోర్డు అనుమతి

సాక్షి, కరీంనగర్‌ : సింగరేణి కార్మికులకు యూనిఫాం కొనుగోలు, 4 భూగర్భ గనుల మైనింగ్‌ ప్లానులకు, ఒక కొత్త ఓ.సి. గనికి అనుమతితో పాటు సింగరేణిలో 3వ దశ సోలార్‌ పవర్‌ ప్లాంటుల నిర్మాణం కాంట్రాక్టులకు సిఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన శనివారం జరిగిన 555వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఎన్‌.శ్రీధర్‌ అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రానున్న కాలంలో నిర్దేశించుకొన్న అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా కొత్తగూడెం ఏరియా పరిధిలో మరో ఓపెన్‌ కాస్ట్‌ గని నిర్మాణానికి ఏర్పటు చేయనున్నామన్నారు. అలాగే ప్రస్తుత భూగర్భ గనుల  విస్తరణలో భాగంగా కాసీపేట, ఆర్‌.కె.-1 ఎ, శ్రీరాంపూర్‌ 1, శ్రీరాంపూర్‌ 3, 3ఎ గనుల మైనింగ్‌ ప్లానులకు బోర్డు అనుమతించిందన్నారు. దీంతోపాటు సింగరేణి కార్మికులకు రెండు జతల యూనిఫాంలను 3 కోట్ల 65 లక్షల రూపాయలతో యూనిఫాంలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణా రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి నామినేషన్‌ పద్ధతిలో కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. 

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటుల నిర్మాణంలో చివరిదైన 3వ దశ నిర్మాణం పనుల కాంట్రాక్టుల అప్పగింతకు బోర్డు అనుమతించిందన్నారు. ఈ 3వ దశలో భాగంగా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వాటర్‌ రిజర్వాయర్‌ పైన  10 మెగావాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓ.సి. గని క్వారీ నీటిపై 5 మెగావాట్ల సామర్థ్యంతోనీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటులతో పాటు కొత్తగూడెం, చెన్నూరు లో నేలపై నిర్మించే సోలార్‌ ప్లాంటు, ఆర్‌.జి. ఓ.సి.-1, డోర్లీ ఓ.సి.-1 ఓవర్‌ బర్డెన్‌ డంపుల మీద నిర్మించే సోలార్‌ ప్లాంటుల నిర్మాణం పనుల అప్పగింత ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లకు ఓ.సి. గనుల్లో వాడే పేలుడు పదార్ధాల కొనుగోలుకు,  కంపెనీ నిర్వహిస్తున్న పేలుడు పదార్ధాల ఉత్పత్తి ప్లాంటులకు కావాలసిన అమ్మోనియాం నెట్రేట్‌, మొదలగు వాటి కొనుగోలుకు, రూఫ్‌ బోల్టుల కొనుగోలు తదితర పనులకు బోర్డు తన అంగీకారం తెలిపిందని వెల్లడించారు.

సింగరేణి సిఎండి ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌ (డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ & పా), ఎన్‌.బలరామ్‌ (డైరెక్టర్‌ ఫైనాన్స్  మరియు పి&పి), డి.సత్యనారాయణ రావు (డైరెక్టర్‌ ఇ&ఎం) పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుంచి బొగ్గు శాఖ సహాయ కార్యదర్శులు  పి.ఎస్‌.ఎల్‌.స్వామి, అజితేష్‌ కుమార్‌, నాగపూర్‌ నుండి వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ ఛైర్మన్‌ ఆర్‌.ఆర్‌.మిశ్రా లు పాల్గొన్నారు. కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్‌.) కె.రవిశంకర్‌, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి మురళీధర్‌ రావులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా