హైదరాబాద్‌ను కరుణించని నిర్మల.. అంచనాలు తలకిందులు

2 Feb, 2022 09:39 IST|Sakshi

కీలక పథకాలకు విదిల్చని నిధులు 

వందే భారత్‌ రైలు, తపాలా శాఖ అంశాల్లోనే ఊరడింపు 

మిగతా వాటిలో సిటీకి మిగిలింది రిక్తహస్తమే 

తీవ్ర అసంతృప్తికి గురవుతున్న సిటీజనులు

కేంద్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ నగరానికి ‘బూస్టర్‌’ దక్కలేదు. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎస్సార్‌డీపీ పనులకు నిధులు విదిల్చలేదు. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.48వేల కోట్లు కేటాయించినప్పటికీ, వీటిలో గ్రేటర్‌ నగరానికి ఎన్ని నిధులందుతాయో చెప్పలేని పరిస్థితి. మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం శూన్య హస్తమే చూపింది. ప్రధానంగా జలమండలి, మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కరువైంది. రెండు అంశాల్లో మాత్రం నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్‌ పరుగులు పెట్టనుంది. సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర బడ్జెట్‌లో నగరానికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి జీహెచ్‌ఎంసీ చేపట్టిన  ఎస్సార్‌డీపీ పనులకు నిధులందుతాయేమోనని పలువురు ఎదురు చూశారు. కానీ.. నిధులు కనిపించలేదు. జీహెచ్‌ఎంసీ దాదాపు రూ.25వేల కోట్లతో ఎస్సార్‌డీపీ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు  అప్పులు, బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడంతోపాటు సొంత ఖజానా నిధులు సైతం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.

నగరాభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్రం సహకారం కూడా  ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎస్సార్‌డీపీ పనులకు కేంద్రం తనవంతుగా రూ.1400 కోట్లు ఆర్థిక సహకారం అందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. నగరంలో నిర్మిస్తున్న లింక్‌రోడ్లు, స్లిప్‌రోడ్ల కోసం మరో రూ.800 కోట్లు అడిగారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాయడం తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి ఎంతోకొంత సహకారం అందగలదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. 
(చదవండిఒక్కరోజే 2,850 కరోనా కేసులు)

పోస్టాఫీసులకు మహర్దశ
ఇప్పటికే  వాణిజ్య బ్యాంకులకు దీటుగా  ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా కేంద్ర బడ్జెట్‌– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్,నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. 

పరుగులు పెట్టనున్న వందే భారత్‌
హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు  వందేభారత్‌  పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా  400 వందేభారత్‌  రైళ్లకు  కేంద్రం ఈ బడ్జెట్‌లో  పచ్చజెండా ఊపిన  నేపథ్యంలో గతంలోనే  ప్రతిపాదించినట్లుగా  హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్‌–ముంబయి.కాచిగూడ–బెంగళూర్‌ నగరాల  మధ్య వందేభారత్‌ రైళ్లను  ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు  గతంలో  ప్రతిపాదించిన  100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్‌లో  మరో 400 రైళ్లను  కేంద్రం కొత్తగా ప్రకటించడం  గమనార్హం.    
(చదవండి: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం! )

మరిన్ని వార్తలు