రుణాల మంజూరులో తెలంగాణపై వివక్ష

4 Mar, 2021 01:05 IST|Sakshi

నిర్లక్ష్యపు ‘ముద్ర’

పీఎంఎంవై కింద ఇచ్చే రుణాల మంజూరులో తెలంగాణపై వివక్ష

మొత్తం 24 కోట్ల యూనిట్ల రుణాల్లోతెలంగాణకు ఇచ్చింది 40 లక్షల యూనిట్లే

ఇంకా 28 లక్షల మంది ఎదురుచూపు

ఉత్తరప్రదేశ్‌ , ఒడిశా, త్రిపుర, కర్ణాటకకు మాత్రం కేంద్రం భారీగా రుణాలు

సాక్షి, హైదరాబాద్‌: చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ప్రవేశపెట్టిన రుణాల మంజూరు ప్రక్రియ రాష్ట్రంలో మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఈ రుణాలివ్వాలని నిర్ణయించగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి ముద్ర రుణ యూనిట్ల మంజూరు తక్కువగానే కనిపిస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలకు మంజూరు చేసిన యూనిట్లతో పోలిస్తే రాష్ట్రానికి ముద్ర రుణాల విషయంలో కేంద్రం వివక్ష కనపరుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం 40 లక్షల మందికే ఈ రుణాలు అందాయి.

తెలంగాణకు చాలా తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు చాలా తక్కువ ముద్ర రుణాలు మంజూరు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర జనాభా 3.85 కోట్లకుపైగా ఉండగా ఇప్పటివరకు కేవలం 40.90 లక్షల యూనిట్లే మంజూరు చేశారు. మనకంటే కేవలం 80 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న ఒడిశాలో ఏకంగా 1.60 కోట్లకుపైగా ముద్ర రుణాలు వచ్చాయి. కర్ణాటకలో 2.45 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.19 కోట్లు, మహారాష్ట్రలో 1.93 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 1.49 కోట్లు, రాజస్తాన్‌లో 98 లక్షలు, మన జనాభాతో సమానంగా ఉన్న జార్ఖండ్‌లో 62 లక్షల యూనిట్లు మంజూరు చేశారు.

దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 24 కోట్లకుపైగా యూనిట్ల ముద్ర రుణాలను డిసెంబర్‌ 31 వరకు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రాష్ట్రానికి కేవలం 40లక్షల యూనిట్లే మంజూరవగా మరో 28 లక్షల మంది చిరువ్యాపారులు ఈ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ సగటు 17.86 ఉండగా, తెలంగాణలో మాత్రం ప్రతి 100 మందిలో కేవలం 10.62 శాతం మందికి మాత్రమే ఈ రుణాలందాయి. కాగా, మన రాష్ట్రంలో ముద్ర రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న చిరు వ్యాపారులు నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోందని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు ఇచ్చిన లక్ష్యం అయిపోయిందని, అంతకు మించి తాము మంజూరు చేయలేమని బ్యాంకర్లు చెపుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని చిరువ్యాపారులను ఆదుకునేందుకు వీలున్నన్ని ముద్ర రుణాలు మంజూరు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరయిన రాష్ట్రాలివే

రాష్ట్రం                   జనాభా            మంజూరైన రుణ యూనిట్లు

అస్సాం              3,56,07,039       74,87,345
కర్ణాటక              6,75,62,686        2,45,02,287
కేరళ                 3,56,99,443        84,01,668
ఒడిశా               4,63,56,334        1,63,01,350
పుదుచ్చేరి         14,13,542            6,80,997
తమిళనాడు        7,78,41,267        3,05,13,243
త్రిపుర               41,69,794          15,59,460
పశ్చిమ బెంగాల్‌  9,96,09,303         2,41,95,057

(నోట్‌: ఈ వార్తకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కేంద్రానికి రాసిన లేఖ బిట్‌ను యాడ్‌ చేసుకోగలరు.)

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో..
త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ జనాభా దాదాపు 10 కోట్లు కాగా అందులో 2.41 కోట్ల యూనిట్ల ముద్ర రుణాలిచ్చారు. అలాగే లెఫ్ట్‌ ఫ్రంట్‌ పాలనలోని కేరళలో కూడా 3.5 కోట్ల జనాభాకు 84 లక్షలకుపైగా యూనిట్లు మంజూరయ్యాయి. తమిళనాడులో 7.78 కోట్ల జనాభాకు 3.05 కోట్ల యూనిట్ల రుణాలిచ్చారు. పుదుచ్చేరి జనాభా 14.13 లక్షలు కాగా అక్కడ 6.80 లక్షలు, 3.5కోట్ల జనాభా ఉన్న అసోంలో 74 లక్షల ముద్ర యూనిట్లు మంజూరవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు