రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా విరాళాలెలా వచ్చాయి? రాహుల్‌గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ ధ్వజం

27 Feb, 2023 10:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని కేంద్ర యువజన, క్రీడలు, సమాచార శాఖమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఈ చందాలు ఎవరెవరు ఇచ్చారు? ఎందుకిచ్చారో రాహుల్‌గాంధీ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు చైనా భారత్‌లో దురాక్రమణకు పాల్పడుతున్నప్పుడు రాహుల్‌గాంధీ చైనా అధికారులతో కలిసి విందులో పాల్గొన్నారని, ఆ విందు కేంద్రంగా ఎలాంటి ప్రణాళికలు రచించారో ప్రజలకు చెప్పాలన్నారు.

ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అనురాగ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ మన దేశ సైనికులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు, జర్నలిస్టులకు ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

కర్ణాటక రాష్ట్రానికి ఎన్నో స్టార్టప్‌ కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణకు మాత్రం రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్సలెన్సీ కేంద్రాలు తెరుస్తామని చెప్పారు.

(చదవండి: అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!)

మరిన్ని వార్తలు