‘శంషాబాద్‌’ విస్తరణకు సహకరిస్తా

12 Sep, 2021 07:40 IST|Sakshi
శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా

రాష్ట్రంలో మరో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా

సీఎం కేసీఆర్‌కు పౌరవిమానయాన మంత్రి సింధియా హామీ

ప్రగతి భవన్‌లో సీఎంతో మర్యాద  పూర్వక భేటీ.. మధ్యాహ్న భోజనం

సాక్షి, హైద‌రాబాద్: విదేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన సింధియా శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా గౌరవార్థం సీఎం కేసీఆర్‌ ఆయన్ను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ కేంద్ర మంత్రిని కోరారు.

హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగిందన్నారు. వైద్య, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల హబ్‌గా హైదరాబాద్‌ మారిందని, దీంతో నగరానికి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికాకు హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి పౌర విమానయాన శాఖ నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో రైలును అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

మామునూరు ఎయిర్‌పోర్టులో త్వరలో ఏటీఆర్‌ కార్యకలాపాలు..
రాష్ట్రం ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల్లో ఒకటైన వరంగల్‌ (మామునూరు) ఎయిర్‌పోర్టులో ఏటీఆర్‌ కార్యకలాపాలు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని సింధియా తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాంకేతిక అనుమతి ఇస్తామమన్నారు. అలాగే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును వైమానిక దళం ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, పెద్దపల్లి (బసంత్‌ నగర్‌), కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ (దేవరకద్ర) ఎయిర్‌ పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలను పున:పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌కు సింధియా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రు లు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్‌ కరోలా, జాయింట్‌ సెక్రటరీ దూబే, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు.  

చదవండి: యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం 

మరిన్ని వార్తలు