నగ మెరిసేనా!

20 Feb, 2022 02:58 IST|Sakshi

భాగ్యనగరానికి నిజాం నగలు? 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన నేపథ్యంలో మరోసారి తెరపైకి 

1995లో రూ.218 కోట్లకు కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

నేషనల్‌ మ్యూజియం నుంచి హైదరాబాద్‌కు తెప్పించే ఆలోచన 

వజ్ర, వైఢూర్యాలు, పగడాలు పొదిగిన తలపాగాలు, నెక్లెస్‌లు

సాక్షి, సిటీబ్యూరో: నిజాం నగలు మన ముంగిటకు రానున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రదర్శిస్తున్న ఆభరణాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అనువైన స్థలం, రక్షణ కల్పిస్తే భాగ్యనగరానికి నగలు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిజాం నగల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా 11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పటివరకు(ఆల్‌టైం) భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. కేవలం  2012లో ఆస్తుల విలువను మదించడం ద్వారా నిజాం ఆస్తుల లెక్కను తేల్చారు. 

రూ.218 కోట్లకు కేంద్రం కొనుగోలు 
ప్రస్తుతం నిజాం నగలు కేంద్ర ప్రభుత్వ అదీనంలో ఉన్నాయి. 1995లో భారత ప్రభుత్వం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది, 1967లో ఉస్మాన్‌ అలీఖాన్‌ మరణానంతరం నిజాం ట్రస్టీలు ప్రసిద్ధిగాంచిన ఈ ఆభరణాల విక్రయానికి  అంగీకరించారు. 1970లో వీటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నిజాం జ్యువెలరీ ట్రస్టీ వీటిని జాతీయ, విదేశీ సంస్థలకు విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో నిజాం మనవరాలు ఫాతిమా ఫౌజియా జోక్యంతో ఆభరణాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 

465 ముత్యాలు పొందుపర్చిన సత్లాడ.. 
173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, ఆర్మ్‌ బ్యాండ్‌లు, కంకణాలు, గంటలు, బటన్‌లు, కఫ్‌ లింక్‌లు, చీలమండలు, వాచ్‌ చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి. నిజాంలు, వారి వారసులు ధరించిన ఆభరణాల్లో ముఖ్యంగా వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఏడు తీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపర్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం..
184.75 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వజ్రం జాకబ్‌ డైమండ్‌ విలువైన వస్తువులలో ఒకటి. వీటిని కొనుగోలు చేసిన కేంద్రం.. ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ దీనిని ప్రదర్శిస్తోంది. ఆభరణాలను తిలకించే సమయంలోనూ కేవలం 50 మందినే అనుమతిస్తోంది. విలువైన వారసత్వ సంపద కావడంతో జాగ్రత్తగా కాపాడుతోంది. నిజాం నగలను హైదరాబాద్‌కు తెప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం గతంలో ప్రయత్నాలు చేశారు.

ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. తాజాగా నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. నిజాం నగలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన నేపథ్యంలో వీటి తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాటి ప్రదర్శనకు అనువైన స్థలం, భద్రత ఏర్పాట్లను కల్పిస్తే.. నగల తరలింపునకు చొరవ చూపుతామని కిషన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు