చేతనైతే ప్రధాని అవినీతి బయటపెట్టు

24 Apr, 2022 01:49 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్‌ 

ధాన్యం కొనుగోళ్లు సహా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం

గవర్నర్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ దిగజారి ప్రవర్తిస్తోంది

ఈడీ, సీబీఐలకు మీరెందుకు భయపడుతున్నారు?

29న రూ.10 వేల కోట్ల పనులకు గడ్కరీ శంకుస్థాపన

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు సత్తా ఉంటే, చేతనైతే ప్రధాని మోదీ అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కేంద్రంపై, ప్రధానిపై గాలి మాటలు మాట్లాడ వద్దని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సహా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమన్నారు. గౌరవప్రదమైన భాషలో మాట్లాడితేనే వస్తానని శనివారం మీడియాతో కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. 

టీఆర్‌ఎస్‌లో భూకంపం రాకుండా చూసుకోండి
గవర్నర్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దిగజారి ప్రవర్తిస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మరో గవర్నర్‌ ఉండి ఉంటే కాళ్ల మీద పడతాడు, ఈ గవర్నర్‌ కాళ్లు పీకుతున్నాడు. ఇంత దిగజారుడు వ్యవహారం ఏ సీఎం చేయలేదు’ అని అన్నారు. ఢిల్లీ వెళ్లి భూకం పం సృష్టిస్తామన్నారని, ముందు టీఆర్‌ఎస్‌లో భూకంపాలు, ప్రళయాలు రాకుండా కేసీఆర్‌ చూసుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో  సీబీఐ, ఈడీ ఒక్క కేసు అయినా రాజకీయ కోణంలో పెట్టిం దేమో చూపాలన్నారు. ‘111జీఓ పరిధిలో మీకు ఏమైనా భూములు ఉన్నాయా... ఈడీ, సీబీఐలకు ఎందుకు భయపడుతున్నారు.’అని ప్రశ్నించారు. 

గవర్నర్‌ పాలన రావాలనుకోవడం లేదు
తెలంగాణలో గవర్నర్‌ పాలన రావాలని తాము అనుకోవడం లేదని కేంద్రమంత్రి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్‌ని తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామన్నారు. ‘రూ.10 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం సహకరించలేదు. సైన్స్‌ సిటీకి భూమి ఇవ్వలేదు. ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభించడం లేదు. వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఇస్తే పెట్టలేదు. మెట్రో పనులు ఆపారు’ అని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్న బస్తీ దవాఖానాలు ఎవరివో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పం దించడంతో చివరకు ఈ నెల 29న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి రూ.10 వేల కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. 

కక్షపూరిత రాజకీయాలు టీఆర్‌ఎస్‌ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్‌ మీడియాపై నిర్బంధం పెరిగి పోయిందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌పై 16 కేసులు పెట్టారని, మూడుసార్లు జైలుకు పంపించి పోలీసులు వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్‌పై కేసు పెట్టారు కానీ అందుకు కారణం అయిన వారిపై మాత్రం కేసు పెట్టలేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు