కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ

21 Aug, 2021 01:24 IST|Sakshi
హనుమకొండ  జిల్లా కమలాపూర్‌లో జరిగిన సభకు హాజరైన ప్రజలు,  బీజేపీ శ్రేణులు. ఇన్‌సెట్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం కేసీఆర్‌ ఇంటికే పరిమితమైంది 

ఓరుగల్లు ప్రజా ఆశీర్వాద యాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం 

వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు చేపట్టాలి

నిధుల కేటాయింపు బాధ్యత నాదే..

సాక్షి, మహబూబాబాద్‌ /వరంగల్‌ /కమలాపూర్‌: నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్‌ కుటుంబం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.

ఇందుకు కావాల్సిన నిధుల కేటాయింపు బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ప్రజాఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్ర వారం ఆయన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్య టించారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, తొర్రూరుల్లో, తర్వాత వరంగల్, వర్ధన్నపేట, జనగామలో యాత్ర సాగింది. శుక్రవారం రాత్రి హను మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల నుంచి కమలాపూర్‌ వరకు యాత్ర నిర్వహించారు. ఆయాచోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.  

ధర్మానికి, అధర్మానికి మధ్య ఎన్నికలు 
ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా హుజూరాబాద్‌లో కమలం పువ్వు గుర్తు జెండాయే ఎగురుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల పేరిట సీఎం కేసీఆర్‌ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాన్ని రాజకీయ అంగడి చేసి ప్రజాప్రతినిధులు, నాయకులను పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. ఇవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. ఇక్కడ ఈటలను గెలిపిస్తే 2023లో తెలంగాణలో తాను బీజేపీ ప్రభుత్వాన్ని తెస్తానన్నారు. ఈ ఎన్నిక ఒక్క ఈటలది కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినదని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును తన పం తాలు, పట్టింపుల కోసం అప్పనంగా ఖర్చు చేస్తున్న సీఎంకుS తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.  

డిసెంబర్‌ నాటికి ప్రజలందరికీ వ్యాక్సిన్‌ 
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కష్టకాలంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని కిషన్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్‌ అందజేయాలన్నదే కేంద్ర సర్కారు ధ్యేయమని తెలిపారు. కరోనా దృష్ట్యా దేశంలోని సుమారు 80 కోట్ల కుటుంబాలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నామన్నారు.  

రన్‌వేకు భూములు సమకూర్చాలి  
ప్రధాని మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందువల్లే ములుగు జిల్లాలోని రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి చెప్పారు. కళ లకు ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు పర్యాటక పరంగా అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాల నుంచి పర్యాటకులు రావాల్సి ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నారో.. ఫామ్‌ హౌస్‌లో ఉన్నారో తెలియదని, మామునూరు విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి భూములను సమకూర్చి అభివృద్ధి చేస్తే విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో, వెయ్యిస్తంభాల గుడిలో కిషన్‌రెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్‌ బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు, కొండేటి శ్రీధర్, రావు పద్మ, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, విజయ రామారావు, చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు