మెదక్‌లో రైలు కూత

24 Sep, 2022 02:26 IST|Sakshi
జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు 

నెరవేరిన మెదక్‌ ప్రజల చిరకాల స్వప్నం

మెదక్‌ రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్‌ రైలు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీపడబోమని వెల్లడి

మెదక్‌జోన్‌: మెదక్‌ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శుక్రవారం మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్‌–అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్‌ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైలును మెదక్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

అంతకుముందు రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించి రైలు టికెట్‌ కొనుగోలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.

మెదక్‌ జిల్లా ప్రజలకు ఇది పండుగ వేళ అన్నారు. మెదక్‌–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. మెదక్‌ నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌–ముంబై ట్రాక్‌కు కనెక్ట్‌ చేస్తారని చెప్పారు. 

త్వరలో వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులు  
గతంలో ఈ ప్రాంతంలోని మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన దుర్ఘటన ఇంకా తన కళ్ల ముందే కదలాడుతోందని, అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 43 స్టేషన్‌ల పరిధిలో ప్రత్యేక పనులను చేపట్టామని కిషన్‌రెడ్డి చెప్పారు. భద్రాచలం, సత్తుపల్లిలో రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ పనులు సైతం రూ.221 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని, రూ.653 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టంచేశారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో్ల ప్రాధాన్యత ఇస్తోందని, మెదక్‌ జిల్లా కేంద్రానికి నేషనల్‌ హైవే నర్సాపూర్‌ మీదుగా నిర్మించారని చెప్పారు.

అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా నాలుగు వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య నియంత్రణ కోసం చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రూ.221 కోట్లతో రైల్వే టర్మినల్‌ నిర్మిస్తున్నామన్నారు. వరంగల్‌లో రూ.400 కోట్లతో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు