'కృష్ణంరాజు చనిపోగానే ఆయన ఫోన్‌చేసి నంబర్‌ అడిగారు'

16 Sep, 2022 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫిలింనగర్ సొసైటీలో దివంగత సినీనటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్‌లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృష్ణంరాజు అని అన్నారు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరని పేర్కొన్నారు. 'నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు' అని మంత్రి తలసాని అన్నారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం. కృష్ణంరాజు చనిపోగానే రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్‌లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్లలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు' అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

చదవండి: (కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శ)

మరిన్ని వార్తలు