కేసీఆర్‌.. వడ్లు కొను లేదా దిగిపో!

12 Apr, 2022 03:44 IST|Sakshi
ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ రైతు దీక్షలో పాల్గొన్న కేంద్రమంత్రి మురళీధరన్, బండి సంజయ్‌. చిత్రంలో ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఈటల రాజేందర్, విజయశాంతి తదితరులు

బీజేపీ దీక్షలో కేంద్రమంత్రి మురళీధరన్‌ డిమాండ్‌ 

ధాన్యం కొనుగోలుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు 

ధరల పెంపు నుంచి ప్రజలను దారిమళ్లించేందుకే ఢిల్లీలో డ్రామా: బండి

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ చీఫ్‌ మినిస్టర్‌ కాదని.. ‘చీఫ్‌ మిస్‌లీడర్‌’(మొత్తం మభ్యపెట్టి తప్పుదోవ పట్టించే) అని పార్లమెంటరీ, విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనాలన్నారు. పంట చేతికొచ్చినా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటూ మోసపోతున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వడ్లు కొనాలని లేదా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్‌ వడ్లు కొను లేదా రాజీనామా చెయ్‌’నినాదంతో రైతు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన మురళీధరన్‌ మాట్లాడారు. ‘కేసీఆర్‌ అంటే... కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు, కరప్షన్‌ రావు, కమీషన్‌ రావు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే మా పార్టీ ఈ దీక్ష నిర్వ హిస్తోంది. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం ఎంతో కృషి చేస్తున్నా.. ధాన్యం కొనేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏ ప్రయత్నం చేయట్లేదు.

తెలంగాణ రైతుల కోసం ఏడేళ్లలో కేంద్రం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసింది. మిల్లర్లతో టీఆర్‌ఎస్‌ నేతలు ఒప్పం దం కుదుర్చుకుని రైతులను మోసం చేస్తు న్నారు. అసలు కేసీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలి? ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కమీషన్‌ రావు వాటిని నెరవేర్చారా? ముఖ్యమంత్రి.. ప్రజలను మిస్‌లీడ్‌ చేస్తూ ’చీఫ్‌ మిస్‌లీడర్‌’ అయ్యారని ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అవుతోంది’అన్నారు. 

ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం: బండి
‘వడ్ల కొనుగోలు పేరిట సీఎం ఢిల్లీకి పోయి దొంగ దీక్ష చేస్తున్నడు. ఉద్యమ సమయంలోనూ దొంగ దీక్షలు చేసిన చరిత్ర ఆయనది. కేసీఆర్‌ దమ్ముంటే.. ఢిల్లీలో కాదు, గల్లీలో తేల్చుకుందాం రా. వడ్లు కొనేదాకా నిన్ను వదిలిపెట్టం.. ఉరికిస్తం. కేంద్రం వడ్లు కొనేందుకు సిద్ధం. సేకరించి ఇచ్చే దమ్ము ఉందో.. లేదో.. కేసీఆర్‌ చెప్పాలి. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. దీని నుంచి దారి మళ్లించేందుకే ఇలా ఢిల్లీలో డ్రామాలాడుతున్నరు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు యాసంగి పంట కొనడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి.

మోదీని గద్దె దించేంతటి మొనగాడివా? రాష్ట్ర ప్రజలు నిన్ను గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నరు. ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష చేస్తానన్న కేసీఆర్‌.. గంటసేపు కూడా కూర్చోలేకపోయాడు’అని ఎద్దేవా చేశారు. ఈ దీక్షలో ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్‌ రావు, పార్టీ నేతలు డీకే అరుణ, డాక్టర్‌ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, జి.వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎ. చంద్రశేఖర్, సుద్దాల దేవయ్య, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చాడ సురేశ్‌రెడ్డి, రవీంద్రనాయక్, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, సీహెచ్‌.విఠల్, రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు