గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో అనాథ శవాల ఆత్మఘోష!

11 Feb, 2023 02:31 IST|Sakshi

కుళ్లిపోయి, దుర్వాసనతో రోజుల తరబడి పఫ్‌రూమ్‌ల్లోనే.. 

20 చొప్పున మృతదేహాలు ఒకేసారి శ్మశానవాటికకు తరలింపు 

దహన కార్యక్రమాల్లో కాంట్రాక్టు సంస్థ చేతివాటం 

నిబంధనలు పాటించని జీహెచ్‌ఎంసీ  

రెండు ఆస్పత్రులనూ వేధిస్తున్న సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి

అవి రాష్ట్రంలోనే పేరొందిన రెండు ప్రభుత్వ పెద్దాస్పత్రులు... పేద రోగులకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల్లోని మార్చురీలు (శవాగారాలు), వాటి దయనీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.. గుండెలు బరువెక్కుతాయి.

ఎంతో మంది అనాథలు, అభాగ్యుల మృతదేహాలు ఆనవాళ్లు లేక మార్చురీల్లో కుళ్లిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ శవాల దిబ్బగా మారుతున్నాయి. సరైన సమయంలో దహన సంస్కారాలకు నోచుకోక వాటి ఆత్మలు ఘోషిన్తున్నాయి.. ఈ హృదయ విదారక దుస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో నిత్యం సుమారు 50 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. వాటిలో దాదాపు 10–15 వరకు అనాథ శవాలే. తాజా మృతదేహాలను మార్చురీలోని ఫ్రీజరు బాక్స్‌ల్లో భద్రపరుస్తున్న సిబ్బంది... గుర్తుతెలియని, అనాథ మృతదేహాలను పఫ్‌రూం (మూకుమ్మడిగా మృతదేహాలను భద్రపరిచే గది)కు తరలిస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం, పోలీసులు, ఫోరెన్సిక్‌ వైద్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా మృతదేహాలను అక్కడ రోజుల తరబడి ఉంచాల్సి వస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సిబ్బంది సైతం లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. 

నిబంధనలకు పాతర! 
పోస్ట్‌మార్టం జరిగిన 72 గంటల తర్వాత అనాథ శవాలను జీహెచ్‌ఎంసీ విభాగం శ్మశానవాటికకు తరలించాలనే నిబంధనలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ ఓ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియల నిర్వహణకు కొంత మొత్తం చెల్లిస్తుండగా ఆ సంస్థ మాత్రం వివిధ సాకులు చెబుతూ మృతదేహాల తరలింపులో తీవ్ర జాప్యం చేస్తోంది.

రవాణా ఖర్చులు మిగుల్చుకొనేందుకు దాదాపు 10 రోజులకోసారి దాదాపు 20 చొప్పున మృతదేహాల తరలింపు ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియలకు కాంట్రా­క్టు సంస్థకు జీహెచ్‌ఎంసీ రూ. 2,000–2,500 మ«­ద్య ఇస్తున్నట్లు సమాచారం. గతంలో గాంధీ, ఉస్మానియాలకు చెందిన అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలు రావడంతో దానిని తప్పించి జీహెచ్‌ఎంసీయే రంగంలోకి దిగినా అదే తీరు నెలకొనడం గమనార్హం. 

కాలేజీలకు కొన్ని అనాథ శవాలు? 
మార్చురీ నుంచి కొన్ని అనాథ శవాలను కొందరు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంసీ) నిబంధనల ప్రకారం మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు మానవ అనాటమీ, డిసెక్షన్‌పై అవగాహన కల్పించాలి. ఇందుకోసం మృతదేహాలు కావాలి. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మృతిచెందే వ్యక్తుల మృతదేహాలు డిసెక్షన్‌కు పనికిరానందున రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ సాధారణ రుగ్మతలతో మరణించే అనాథల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కొందరు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

పుర్రె, ఎముకల విక్రయం! 
అంత్యక్రియలకు ముందు అప్పుడప్పుడూ అనాథ మృతదేహాల నుంచి పుర్రెతోపాటు కొన్ని శరీర భాగాలకు చెందిన ఎముకలను వేరు చేసి తాంత్రిక, భూత వైద్యులుగా చెలామణి అయ్యే వారికి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పుర్రెను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు, చేతి, తొడ ఎముకలు, వెన్నెముక, జాయింట్‌గా ఉన్న ఐదు చేతివేళ్ల ఎముకలను రూ. 2 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

వెంటాడుతున్న సిబ్బంది కొరత..  
గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సిబ్బంది కొరత వెంటాడుతోంది. గాంధీ మార్చురీలో ప్రస్తుతం ఏ­డు­­గురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మ­రో ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బందితో ఇంకో యూనిట్‌ ఏర్పా­టు చేయాలనే ప్రతిపాదన కొ­­న్నేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. మ­రోౖ­వెపు ఉస్మానియాలో వైద్యుల కొరత అంతగా లే­కున్నా ఏడుగురు కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.  

సమన్వయంతో అంత్యక్రియలు 
గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పఫ్‌ రూంలోకి తరలించాక 5–6 మృతదేహాలను ఒకసారి చొ­ప్పు­న జీహెచ్‌ఎంíసీ సి­బ్బం­ది తీసుకెళ్తున్నారు. వా­రి­తో సమన్వయం చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. 
– డాక్టర్‌ బి. నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

చనిపోయిన వ్యక్తి అనాథ కాకూడదు 
గుర్తుతెలియని వ్యక్తిని అనా­థ శవంలా కాకుండా వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలనే మా ఉద్దేశానికి వ్య­తిరేకంగా ఈ తంతు నడుస్తోంది. ప్రభుత్వంతో 8 ప్రా­మాణికాలకు అనుగుణంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేం నడుచుకున్నా మమ్మల్ని కాదని జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. 
– డా. రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్, ప్రధాన కార్యదర్శి 

తరలింపులో కొన్నిసార్లు జాప్యం 
అనాథ శవాల తరలింపులో కొన్నిసార్లు జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మేం ప్రతిరోజూ జీహెచ్‌ఎంసీకి అనాథ శవాల వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తున్నాం. గాంధీలో 60 మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజరు బాక్సులు, పఫ్‌రూంతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. 
– ప్రొఫెసర్‌ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

జాప్యం లేదు.. 3
అనాథ శవాల తరలింపులో జాప్యం జరగట్లేదు. సమాచారం అందిన వెంటనే మార్చురీ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. 
– ముకుందరెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, బేగంపేట సర్కిల్‌ 

మరిన్ని వార్తలు