వడగళ్లు.. ఈదురుగాలులు

19 Mar, 2023 02:38 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ముంచెత్తిన అకాల వర్షాలు 

ఖమ్మం జిల్లాలో తెగిపడ్డ విద్యుత్‌ తీగలు తగిలి వృద్ధ దంపతుల మృతి 

పలు జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం 

హైదరాబాద్‌లో సుమారు అరగంటపాటు కుండపోత 

నేడు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవొచ్చన్న వాతావరణ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం సైతం అకాల వర్షాలు కురిశాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం వందనం గ్రామంలో వర్షానికి తెగిపడిన కరెంటు తీగలు తగిలి వృద్ధ దంపతులు మృతిచెందగా పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 

నేలరాలిన పంటలు.. 
జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల, జనగామ, భూపాలపల్లి జిల్లా గణపురం, మొగుళ్లపల్లి, మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, తొర్రూరు మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి వరి పైరు నేలకొరగగా, మామిడి, ఇతర తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం మంచినీళ్లబావిలో నిమ్మతోటలు వేర్లతో సహా కూలిపోయాయి.

సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌లో వరిపైరు నెలకొరిగింది. తిరుమలగిరి మండలంలో కురిసిన వడగళ్లకు పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గద్వాల జిల్లా గట్టు, ధరూర్‌ మండలంలో వడగండ్ల వానకు వందల ఎకరాల్లో పొగాకు, మామిడి, ఆముదం పంటలు నాశనమయ్యాయి.

నారాయణపేట జిల్లా మక్తల్, కోస్గి మండలంలో మునగ, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు పాన్‌గల్, చిన్నంబావి, ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, రేవల్లి మండలాల్లో కురిసిన గాలివానకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలో దాదాపు 365 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 

దంపతుల మృతి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన దంపతులు బానోతు రాములు (65), రంగమ్మ (62) ప్రతిరోజు మాదిరిగానే మేకలను మేపేందుకు శనివారం ఉదయం పొలాలకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కొదుమూరు గ్రామానికి చెందిన రైతు తాళ్లూరి వెంగళరావు సుబాబుల్‌ తోటలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. వాటిపై రాములు, రంగమ్మ కా లుపెట్టడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. 4 మేకలు కూడా మృతిచెందాయి. 

గ్రేటర్‌లో దంచికొట్టిన వాన.. 
భాగ్యనగరంలో శనివారం సాయంత్రం సుమా రు అరగంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫి క్‌ స్తంభించింది.

కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా పంజగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, సైదాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్‌లను భారీ వర్షం ముంచెత్తింది. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

కుషాయిగూడ, టోలిచౌకీ, బేగంపేట, సికింద్రాబాద్‌ల పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యధికంగా గాజులరామా రంలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురవగా జీడి మెట్లలో 4.2, రామచంద్రాపురంలో 4.0, చర్లపల్లిలో 3.6 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. 

నేడు అక్కడక్కడా తేలికపాటి వానలు 
దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదు గా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో శనివారం అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు