Rahul Gandhi Tour: మీడియాకు ఎక్కితే ఉపేక్షించం.. సొంత పార్టీ నేతలకు రాహుల్‌ వార్నింగ్‌

7 May, 2022 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు కానీ, జన బలం లేదని విమర్శించారు. ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏదీ ఉండదన్నారు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య భీకర పోరాటం ఉండబోతుందని తెలిపారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్‌ భేటి అయ్యారు. టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశానికి రాహుల్‌, రేవంత్‌, భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ సహా 300 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందన్నారు. ఎంత సీనియర్లైనా ఎంత రాజకీయ చరిత్ర ఉన్నవారికైనా ఇది వర్తిస్తుందన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని టికెట్లు ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో కూర్చుంటే టికెట్లు రావని, ప్రజలతో ఉండి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు.
చదవండి: కాంగ్రెస్‌ బలోపేతం, ఎన్నికల సంసిద్ధతపై రాహుల్‌ దిశా నిర్దేశం

ఆ తర్వాత నన్ను ఎవరూ తప్పు పట్టొద్దు. టికెట్‌ వస్తుందన్న భ్రమలో ఎవరూ ఉండొద్దు. మన ముందు రెండు మూడు లక్ష్యాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కలల్ని నిజం చేయడం మన లక్ష్యం. ఈ లక్ష్యాలు సాధించాలంటే మన పార్టీలో ఐకమత్యం అవసరం. వరంగల్‌ డిక్లరేషన్‌ రైతులకు కాంగ్రెస్‌కు మధ్య నమ్మకం కలిగించేది. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అది అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. వచ్చే నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలి. మీడియా మందు ఏది పడితే అది మట్లాడొద్దు. ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడండి. మీడియాకు ఎక్కితే ఉపేక్షించేది లేదు.’ అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు