వంద పడకలు.. ముగ్గురే బాధితులు

30 Apr, 2021 08:48 IST|Sakshi

ప్రభుత్వ హోమియో ఆస్పత్రి ఐసోలేషన్‌లో సౌకర్యాల లేమి 

చేరడానికి ఆసక్తి చూపని కోవిడ్‌ బాధితులు  

కలెక్టర్‌ ఆదేశించినా బేఖాతు 

సౌకర్యాలు కల్పించాలని రోగుల వేడుకోలు   

రామంతాపూర్‌: ఉప్పల్‌ సర్కిల్‌లోని రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, చిలుకానగర్‌ డివిజన్లకు చెందిన వందలాది మంది ప్రతిరోజు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేసుకుంటున్నారు. చాలా మంది కోవిడ్‌ బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్‌ సోకే అవకాశం ఉందని రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియో ఆస్పత్రిలో వంద పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రంలో చేరుదామని ఆశగా వస్తున్నారు.

కానీ ఈ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. వంద పడకలతో ఏర్పాటుచేసిన ఈ ఐసోలేషన్‌ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటివరకు ముగ్గురే చేరారు. దీంతో ఐసోలేషన్‌ కోసం ఏర్పాటు చేసిన పడకలు నిరుపయోగంగా మారాయి. ఐసోలేషన్‌ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణంతో పాటు పల్స్‌ యాక్సిలేటర్, ఆక్సిజన్‌ సిలిండర్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఆదివారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి ఐసోలేషన్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా బెడ్లు ఖాళీగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఐసోలేషన్‌ సెంటర్‌ను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించించా ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని సెంటర్‌లో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

( చదవండి: కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు ) 

మరిన్ని వార్తలు