వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

16 Feb, 2022 03:59 IST|Sakshi
స్మార్ట్‌ ఫోన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి    

కాప్రా: ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంలో ఆశ వర్కర్లది కీలక పాత్ర అని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కొనియాడారు. ఏఎస్‌రావునగర్‌ డివిజన్   జమ్మిగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు ఆవ వర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు.

ఆశవర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో వేతనాలు సరిగా అందక, ఎప్పుడు వస్తుందో తెలియక ఆశ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం వారి వేతనాలు పెంచి ప్రతి నెల సమయానికి అందేలా చొరవ చూపుతోందన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆశ వర్కర్లకు వేతనాలు అందిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ సింగిరెడ్డి శిరీషరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, డివిజన్ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఉప్పల్‌ నియోజకవర్గం నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి వైద్యులు సంపత్‌కుమార్, స్వప్న పాల్గొన్నారు. 

దుప్పట్ల పంపిణీ.. 
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం జమ్మిగడ్డలో టీఆర్‌ఎస్‌ పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఏఎస్‌రావునగర్‌ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి హాజరై వృద్ధులు, పేదలకు దుప్పట్లు, దుస్తులు, పండ్లు అందించారు. 

మరిన్ని వార్తలు