హైదరాబాద్‌: భారీగా పెరుగుతున్న ఎలక్ట్రికల్‌ వాహనాలు

7 Aug, 2021 10:36 IST|Sakshi

గ్రేటర్‌లో విరివిగా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు

దృష్టి సారించిన టీఎస్‌ రెడ్‌కో

118 చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు

ఇప్పటికే 67 స్టేషన్లు అందుబాటులోకి

వచ్చే మూడేళ్లలో 600 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదన

పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో జనం ఎలక్ట్రికల్‌ వాహనాలపై దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌలభ్యం ఉండడంతో నగరంలో ఎలక్ట్రికల్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. వినియోగం మేరకు వాహనాల చార్జింగ్‌ పాయింట్లను పెంచేందుకు గ్రేటర్‌లో ప్రతి మూడు కిలోమీటర్లకు, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థల్లోనే ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తోంది. చార్జింగ్‌ పాయింట్లు విరివిగా ఏర్పాటైతే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. 
– సాక్షి, సిటీబ్యూరో
 

రూ.6 ఖర్చుతో 80 కి.మీ ప్రయాణం
సాధారణ పెట్రోల్, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఎలక్ట్రిక్‌ బైక్‌పై కేవలం రూ.6 ఖర్చుతో 80 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ఇటీవల ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు సిటీజనులు ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్‌లో ఇప్పటికే 2230 ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ వెహికిల్స్, 404 కార్లు, 67 టాక్సీలు, 21 ఆటోలు, 365 లైట్‌ గూడ్స్‌ వెహికిల్స్‌ ప్రయాణిస్తున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  
 
మరో 600 స్టేషన్లకు టెండర్లు 
తాజాగా మరో 138 చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థలాల ఎంపిక పక్రియను కూడా చేపట్టారు. వీటిలో ఒక్క గ్రేటర్‌లోనే 118 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వరంగల్, కరీంనగర్‌లో మరో పది స్టేషన్ల చొప్పున ఏర్పాటు చేయాలని రెడ్‌కో భావిస్తోంది. వాహనాల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో మరో 600 విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు ఔత్సాహికుల నుంచి టెండర్లు పిలువాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ కూడా పూర్తికానుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆఫీసుల్లో అద్దె ప్రతిపాదిక పనిచేస్తున్న ప్రైవేటు వాహనాల స్థానంలో ఈ విద్యుత్‌ వాహనాలను ఏర్పాటు చేసే యోచన కూడా ఉంది.

తద్వారా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకంలో భాగం గా సబ్సీడీపై ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను అందజేయడం ద్వారా వాహనదారులకు ఖర్చులు తగ్గడంతో పాటు మరింత ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు పెట్రోల్, డీజిల్‌ కోసం ప్రభుత్వ సంస్థలు ఆయా కాంట్రాక్టర్లకు భారీగా బిల్లులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని టీఎస్‌ రెడ్‌కో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డీవీ రామకృష్ణ కుమార్‌ స్పష్టం చేశారు. 

చార్జింగ్‌ స్టేషన్లు ఇక్కడే.. 
నగరంలో ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్‌ భవన్‌ సహా విద్యుత్‌ సౌధ, బీఆర్కే భవన్, ముషీరాబాద్, ఉప్పల్‌ బస్‌డిపోలు, నిమ్స్‌మే, సీఐటీడీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో 67 చార్జింగ్‌ స్టేషన్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచి్చంది. వీటికి దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ నుంచి 7.5 కిలోవాట్స్‌ సామర్థ్యం ఉన్న విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుని, యూనిట్‌కు రూ.6 చొప్పున సంస్థకు ఛార్జీ చెల్లిస్తున్నారు. చార్జింగ్‌కు వచి్చన వాహనదారుల నుంచి స్లాబ్‌రేట్‌ను బట్టి యూనిట్‌కు రూ.12 వరకు చార్జీ చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్‌ ఖర్చుతో పోలిస్తే..విద్యుత్‌ చార్జింగ్‌ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు.  ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి ఉన్నా..చాలా మందికి చార్జింగ్‌ ఎలా చేసుకోవాలనే దానిపై అనుమానాలున్నాయి. అన్నిచోట్లా చార్జింగ్‌ సదుపాయాలు లభిస్తాయో లేదోననే సందేహం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాహనదారుల అవసరాలకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

విక్రయాలు పెరిగాయి 
పెట్రోల్‌ చార్జీలు భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొంటున్నారు. ఇటీవల వీటి అమ్మకాలు పెరిగాయి. మా షోరూంలో ఇప్పటికి 450పైగా టూ వీలర్లు విక్రయించాం. పెట్రోల్‌ వాహనాలతో పోలీస్తే వీటి రోజువారి నిర్వహణ కూడా చాలా తక్కువ. రూ.6 చార్జితో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. పరిమితమైన వేగంతో ప్రమాదాలు కూడా తగ్గుతాయి. రిజి్రస్టేషన్, ఈ చలాన్ల బాధ కూడా లేదు. అంతేకాదు త్రీ పిన్‌ ప్లగ్‌ ఉంటే చాలు ఇంట్లోనే చార్జింగ్‌ చేసుకునే అవకాశం ఉంది.
–కె.ఎస్‌ పురందర్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ డీలర్, చైతన్యపురి

మరిన్ని వార్తలు