Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!

13 Aug, 2021 02:52 IST|Sakshi

గండిపేట చెరువు కుంచించుకుపోవడంపై పర్యావరణవేత్తల ఆందోళన

హెచ్‌ఎండీఏ, జలమండలి మ్యాప్‌లు పరిశీలిస్తే విస్తీర్ణంలో వ్యత్యాసం

300 ఎకరాల మేరకు తగ్గుదల!

ఉన్నతస్థాయి కమిటీ పనితీరుపై హైకోర్టు సీరియస్‌

ఐదేళ్లుగా నివేదిక ఇవ్వకపోవడంపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్‌ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్‌టీఎల్‌ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల ఎఫ్‌టీఎల్‌ పరిధిపై 2019లో హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్‌ మ్యాప్‌ విడుదల చేశాయి.

గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్‌ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ  హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం
గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్‌ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్‌ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్‌ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్‌కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు.

ఆక్రమణలే శాపం
ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్‌ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్‌ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్‌లు కూడా శాపంగా పరిణమించాయి.

సమగ్ర విచారణ చేపట్టాలి
గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్‌ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్‌సాగర్‌ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి.
– లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త

మరిన్ని వార్తలు