గ్రేటర్‌ వరద సాయంలో రూ.387కోట్ల స్కాం

7 Nov, 2020 02:05 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన ప్రజలకు పరిహారం పంపిణీ చేయడంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ వరద సాయం పంపిణీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ సాయం అంటశాలపై చర్చించేందుకు శుక్రవారం ఆయన పార్టీ నేతలతో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌యాదవ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు మేలు చేసేందుకే...
వరద బాధితులకు రూ.550 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని,  రూ. 2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు కూడా హైదరాబాద్‌కు ఇవ్వలేరా? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు మేలు చేసేందుకే అధికారులు వరద సాయాన్ని నగదు రూపంలో ఇచ్చారని ఆరోపించారు. వరద సాయం కింద నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 50 వేలు ఇవ్వాలని, కూలిపోయిన ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు ఇవ్వాలన్నారు.

గవర్నర్‌తో ఫోన్‌లో సంభాషణ
గ్రేటర్‌ పరిధిలో జరిగిన వరద సాయం అక్రమాల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్‌ కోరింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఆమెతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు