నర్సింహులు మృతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

30 Jul, 2020 13:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు బ్యాగరి నర్సింహులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నర్సింహులు మరణానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ‘దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఉన్న భూమిని దౌర్జన్యంగా గుంజుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. దళిత ముఖ్యమంత్రి చేస్తామని మోసంచేసి దళితులను బలి తీసుకుంటున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాలి. టీఆర్ఎస్ పాలన అంతమయ్యే వరకు దళితులకు న్యాయం జరగదు. నర్సింహులు మరణానికి కారణమైన అందరిపైన హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన ఎస్సీ సామాజికవార్గానికి చెందిన బ్యాగరి నర్సింహులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవంటం అత్యంత బాధాకరమన్నారు. 

నర్సింహులకు చెందిన 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనే ఆవేదనతో బుధవారం పురుగులమందు తాగి ఆ‍త్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని గజ్వెల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం 3 గంటలకు నర్సింహులు చికిత్స పొందుతూ మృతిచెందాడు.బ్యాగరి నర్సింహులు మృతికి బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఉత్తమ్‌ అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఇటీవలే భూపాలపల్లి జిల్లా మల్లారంలో దళిత యువకుడు రాజబాబును హత్య చేశారని ఆరోపించింది. అంతకు ముందు మంథని దగ్గర రామగిరి గ్రామానికి చెందిన శీలం రంగయ్య అనే దళిత యువకున్ని లాకప్‌ డెత్‌ చేశారని మండిపడింది. గతంలో నెరేళ్లలో దళిత, బీసీ యువకులు ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీసులతో దాడి చేపించారని, ఇసుక లారీల వల్ల ప్రజలు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రభుత్వం ఇసుక మాఫియాకే మద్దతు ఇచ్చిందని దుయ్యబట్టింది. ఇంత దారుణంగా దేశంలో ఎక్కడ లేదుని, ప్రజలంతా ఏకమై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

>
మరిన్ని వార్తలు