వేగంగా టీఆర్‌ఎస్‌ పతనం

1 Mar, 2021 04:25 IST|Sakshi

బీజేపీ నీటి బుడగ మాత్రమే 

ఈసారి కాంగ్రెస్‌దే అధికారం 

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ వ్యాఖ్యలు 

కాంగ్రెస్‌కు అనుబంధ సంఘాలే ఆస్తి అని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పతనం చాలా వేగంగా జరుగుతోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందన్న భావన సరైంది కాదని, అది కేవలం నీటి బుడగ మాత్రమేనని అన్నారు. తన రాజకీయ అనుభవం మేరకు, విశ్లేషకుల పరిశీలనను బట్టి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పార్టీ అనుబంధ సంఘాల నేతలతో ఆదివారం ఆయన గాంధీ భవన్‌లో సమావేశం అయ్యారు.   

రాములు నాయక్‌ గెలుపునకు కృషి చేయాలి 
కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధ సంఘాలే పెద్ద ఆస్తి అని, కాంగ్రెస్‌ పార్టీలో పనిచేయడం అదృష్టమని ఉత్తమ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎస్‌.రాములునాయక్‌ విజయానికి అనుబంధ సంఘాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి చోటా బలంగా ఉన్న పార్టీ కేడర్‌ను ఎన్నికల్లో భాగస్వాములను చేయాలన్నారు. 

టీఆర్‌ఎస్, బీజేపీ విధానాలను ఎండగట్టండి 
టీఆర్‌ఎస్, బీజేపీల ప్రజావ్యతిరేక విధానాలను పట్టభద్రుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. బీజేపీ మతపరంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఏడేళ్లవుతున్నా దేశానికి, రాస్ట్రానికి చేసింది శూన్యమన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సంఖ్య రెట్టింపయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో గత 60 ఏళ్ల కాలంలో రూ. 60 వేల కోట్ల అప్పు అయితే, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో అప్పు ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు చేరిందని ఉత్తమ్‌ విమర్శించారు.    

మరిన్ని వార్తలు