రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2ఎక్స్ టెక్నాలజీ! ఎన్నెన్నో ప్రయోజనాలు

12 May, 2022 09:06 IST|Sakshi
వీ2ఎక్స్‌ టెక్నాలజీ అమర్చిన కారును పరీక్షిస్తున్న దృశ్యం

రోడ్డు భద్రతకు, ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నాలజీ 

ఐఐటీ హైదరాబాద్, జపాన్‌ సుజుకి, మారుతి సుజుకి సంస్థల సంయుక్త రూపకల్పన 

రోడ్లపై పరీక్షించేందుకు సహకరిస్తాం: జయేశ్‌ రంజన్‌  

► కారులో వేగంగా వెళ్తున్నారు.. ఉన్నట్టుండి ఎదురుగానో, పక్కనుంచో ఓ బస్సు దూసుకొచ్చింది.. మీకు అప్పటికే ఆ బస్సు వస్తున్న విషయం తెలిసింది.. మీ కారు వేగం తగ్గించి భద్రంగా ఓ పక్కకు జరిగారు. 
► మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. సిగ్నల్, జీబ్రాక్రాసింగ్‌ వంటివి లేకున్నా ఓ చోట కొందరు రోడ్డు దాటుతున్నారు. కొంత దూరం నుంచే మీ కారు దీనిపై అలర్ట్‌ చేయడంతో వేగం తగ్గించారు.

.. ఇదంతా ‘వీ2ఎక్స్‌ (వెహికల్‌ టు ఎవ్రీథింగ్‌) కమ్యూనికేషన్‌ టెక్నాలజీ మహిమ. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ ఐఐటీ, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకి మోటార్‌ కార్పొరేషన్, మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ టెక్నాలజీని రూపొందించాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ ప్రాంగణంలో.. ఐదు వాహనాలను వీ2ఎక్స్‌ టెక్నాలజీతో నడుపుతూ టెక్‌ షో నిర్వహించారు.

2025 నాటికి ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ప్రాజెక్టు ప్రతినిధులు ప్రకటించారు. రహదారి భద్రతకు ఎంతో ఉపయోగపడే వీ2ఎక్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని రహదారులపై పరీక్షిస్తే.. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, సుజుకి, మారుతి సుజుకి సంస్థల ప్రతినిధులు, కేంద్ర టెలికం శాఖ అధికారులు పాల్గొన్నారు. 

‘వీ2 ఎక్స్‌’అంటే.. 
‘వెహికిల్‌ టు ఎవ్రీథింగ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’..రోడ్డుపై వెళ్తున్న అన్నిరకాల వాహనాలు, పాదచారులతో అనుసంధానమవుతుంది. చుట్టూ ఉన్న వాహనాలు, వాటివేగం, సమీపంగా రావడం వంటివాటిని గమనిస్తూ..ప్రమాదాలు జరగకుండా డ్రైవ ర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఐఐటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ టెక్నాలజీ పనితీరును ప్రాజెక్టు ఇన్‌చార్జి ప్రత్యూష వివరించారు. ప్రధానంగా ఆరు ప్రయోజనాలు ఉన్నట్టు తెలిపారు. 

ప్రయోజనాలివీ..
1.అంబులెన్స్‌ హెచ్చరిక వ్యవస్థ: అంబులెన్స్‌ వంటి అత్యవసర వాహనాలు కారుకు సమీపంలోకి వస్తున్నప్పుడు.. వాటికి దారి ఇచ్చేలా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. అంబులెన్స్‌ ఎన్ని నిమిషాల్లో తన వాహనాన్ని సమీపిస్తుంది, ఎక్కడ దారి ఇవ్వాలనేది కూడా సూచిస్తుంది. 
2.పాదచారుల హెచ్చరిక వ్యవస్థ: పాదచారులు రోడ్లపై కారుకు అడ్డుగా వచ్చే అవకాశముంటే వెంటనే గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఢీకొట్టకుండా ముందుగా జాగ్రత్త పడేందుకు సహాయం చేస్తుంది. 
3. బైక్‌ అలర్ట్‌ సిస్టమ్‌: రోడ్డు సందులు, మూల మలుపుల్లో అకస్మాత్తుగా వచ్చే ద్విచక్ర వాహనాలను కార్లు ఢీకొనడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీ2ఎక్స్‌ టెక్నాలజీని ద్విచక్ర వాహనాలకు కూడా అనుసంధానిస్తే.. బైక్‌ ఎంత దూరంలో ఉంది, ఏ దిశలో వస్తుందనే విషయాన్ని కారు డ్రైవర్‌కు చేరవేస్తుంది. 
4. రోడ్‌ కండిషన్‌ అలర్ట్‌ సిస్టమ్‌: రోడ్డు సరిగ్గా లేనిచోట్ల డ్రైవర్‌ను హెచ్చరిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని అప్రమత్తం చేస్తుంది. 
5. చాలా దూరం నుంచే పసిగట్టి: ఒక్కోసారి రాంగ్‌ రూట్‌లో వచ్చే వాహనాలు కారు దగ్గరికి వచ్చే వరకు గుర్తించలేం. అలాంటి వాహనాలను చాలా దూరం నుంచే పసిగట్టి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. 
6. కారు కంప్యూటర్‌గా: కారును డ్రైవింగ్‌కు ఉపయోగించనప్పుడు.. అందులోని మైక్రో ప్రాసెసర్‌ను కంప్యూటింగ్‌ కోసం వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. 
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి 

మరిన్ని వార్తలు