-

దేశంలోనే 100% వ్యాక్సిన్‌ వేసుకున్న తొలి గ్రామం.. ఎక్కడో తెలుసా?

4 Aug, 2021 07:33 IST|Sakshi
 రాజన్నపేటలో వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం 

కోవిడ్‌రహిత గ్రామంగా రాజన్నపేట

ఊరంతా టీకా వేయించుకున్న మారుమూల గ్రామం

వ్యాక్సినేషన్‌లో పల్లె చైతన్యం

‘ప్రాజెక్టు మదద్‌’ప్రయోగం సక్సెస్‌

 ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్‌ దత్తత గ్రామం 

సాక్షి, సిరిసిల్ల: అది మారుమూల పల్లె. ఒకప్పుడు నక్సలైట్ల కదలికలతో కల్లోలంగా ఉండే ఆ ఊరు ఇప్పుడు కరోనా వైరస్‌ను కట్టడి చేసే యజ్ఞంలో స్ఫూర్తిగా నిలిచింది. వంద శాతం కోవిడ్‌–19 కట్టడికి అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలనే సదాశయంతో ‘ప్రాజెక్టు మదద్‌’అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు రాగా.. ఆ పల్లెవాసులు మద్దతుగా నిలిచారు. ఊరంతా టీకా వేయించుకున్న గ్రామంగా దేశంలోనే గుర్తింపు పొందింది ఆ పల్లె. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట వంద శాతం టీకాతో ఆదర్శంగా నిలిచింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావుకు రాజన్నపేట దత్తత గ్రామం కావడం విశేషం.

ఎలా సాధించారంటే.. 
కరోనా భయం నుంచి పల్లెలను కాపాడాలనే సంకల్పంతో ‘ప్రాజెక్టు మదద్‌’ సంస్థ రాజన్నపేటలో ఐదంచెల విధానాన్ని అమలు చేసింది. ఆ ఊరి జనాభా 2,253. అందులో వ్యాక్సిన్‌ వేసుకోడానికి అర్హత ఉన్న వారిని ముందుగా ఇంటింటి సర్వే ద్వారా గుర్తించారు. వారికి ముందుగా ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేసి ‘ప్రాజెక్టు మదద్‌’పై నమ్మకాన్ని పెంచారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లకు పల్స్‌ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లను ఉచితంగా ఇచ్చారు. మహిళా సంఘాలు, యువకులను చైతన్యపరిచారు. 52 మహిళా సంఘాల్లోని సభ్యులకు టీకాపై ఉన్న అపోహలను తొలగించారు. అంతే కొద్ది రోజుల్లోనే ఆ ఊరిలో వంద శాతం వ్యాక్సినేషన్‌ సాకారమైంది. దీనిపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు స్పందిస్తూ రాజన్నపేట గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని ధ్రువీకరించారు. మిగతా గ్రామాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.  

ఈ వృద్ధురాలి పేరు చింతల రాజవ్వ (70). రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన రాజవ్వ రెండు డోస్‌ల టీకా తీసుకుంది. ఒంటరిగా ఉండే రాజవ్వకు బీపీ, షుగర్‌ ఏమీ లేవు. ఆ ఊరిలో ఒక్క రాజవ్వనే కాదు.. 18 ఏళ్లు దాటిన అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నారు.  

నాలుగు కేంద్రాల్లో.. 
రాజన్నపేటలో గ్రామ పంచాయతీ, రెడ్డి సంఘం భవనం, మహిళా సంఘ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏక కాలంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ చేశారు. కోవిషీల్డ్‌ టీకాను ‘ప్రాజెక్టు మదద్‌’సంస్థ సొంత ఖర్చులతో కొనుగోలు చేసి ఇవ్వడం విశేషం. కలెక్టర్‌ ఆదేశాల మేర కు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్‌ చేశారు. ఇప్పుడు రాజన్నపేటకు కోవిడ్‌ను నిరోధించగల సత్తా చేకూరింది. ఆ ఊరి అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. 

‘ప్రాజెక్టు మదద్‌’ గురించి.. 
అమెరికాలో స్థిరపడిన కొంతమంది భారతీయ వైద్య నిపుణులు పల్లె ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ‘ప్రాజెక్టు మదద్‌’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ‘ఫస్ట్‌ అమెరికన్‌ లైఫ్‌’, ‘కాల్‌ హెల్త్‌’, ‘రిపుల్స్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ ఫౌండేషన్‌’సంస్థలు చేయూతనిచ్చాయి. దీంతో నేరుగా ప్రజల ముంగిట్లోకి వెళ్లి పని చేసి సక్సెస్‌ అయింది.


రాజన్నపేటలో మాస్కులతో మహిళలు

శక్తివంతమైన విధానంతో..
ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న శక్తివంతమైన విధానాన్ని రాజన్నపేటలో అమలు చేశాం. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో చేయించడం ఒక్కటే మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వమొక్కటే ఈ పని చేయలేదని భావించి పల్లె ప్రజలకు సేవ చేసేందుకు పూనుకున్నాం. సక్సెస్‌ అయ్యాం. 
– బలరాం రెడ్డి, ప్రాజెక్టు మదద్‌ నిర్వాహకుడు

అందరూ సహకరించారు 
మా ఊళ్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ అయింది. ‘ప్రాజెక్టు మదద్‌’సంస్థతో పాటు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, గ్రామస్తుల సహకారంతో ఇది సాధ్యమైంది. దేశంలోనే మా ఊరికి పేరు రావడం సంతోషంగా ఉంది. 
– ముక్క శంకర్, సర్పంచ్, రాజన్నపేట

అర్హులందరికీ టీకా వేశాం.. 
రాజన్నపేటలో ఇం టింటా సర్వే చేయిం చి వ్యాక్సినేషన్‌ చేశాం. అర్హులందరికీ టీకా ఇచ్చాం.  
– సుమన్‌మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి 

మరిన్ని వార్తలు