ఈకాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్‌ ఆగ్రహం

23 Apr, 2021 03:40 IST|Sakshi

వ్యాక్సిన్‌ ధరల్లో తేడాలెందుకు?

అండగా నిలవాల్సిన సమయంలో భారం మోపడం సరికాదు

కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ (జీఎస్‌టీ) విధానానికి మేము అంగీకరించాం. కానీ ఇప్పుడు మాత్రం ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు వేర్వేరు ధరలు ఎందుకు? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ ద్వారా గురువారం వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికేమో వాక్సిన్‌ రూ.150, రాష్ట్రాలకు మాత్రం రూ.400 ఎందుకని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ‘పీఎం కేర్స్‌’ నుంచి అదనపు ధరను కేంద్ర ప్రభుత్వం ఎందుకు భరించడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ద్వంద్వ వాక్సిన్‌ ధరల విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తుండగా, కేటీఆర్‌ కూడా గురువారం ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌ మూలంగా ఆర్థికంగా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై మరింత భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సబ్‌కా సాథ్‌ సబ్కో వాక్సిన్‌’ హ్యాష్‌టాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో ద్వంద్వ వాక్సిన్‌ ధరలపై వెల్లువెత్తుతున్న నిరసనకు కేటీఆర్‌ మద్దతు పలికారు.

మున్సిపల్‌ సిబ్బందికి వాక్సినేషన్‌పై హర్షం
పురపాలక శాఖ పరిధిలోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వాక్సినేషన్‌ జరుగుతున్న తీరుపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో 95.55 శాతం మందికి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 96.19 శాతం మంది సిబ్బందికి వాక్సినేషన్‌ పూర్తయిందని కేటీఆర్‌ వెల్లడించారు.

చదవండి: లక్షల్లో అడిగితే వేలల్లో ఇస్తారా? కేంద్రంపై ఈటల ఫైర్‌

చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు