వ్యాక్సిన్‌ కొరత: మే 31వరకు రెండో డోసే

14 May, 2021 01:50 IST|Sakshi

వ్యాక్సినేషన్‌ లో వీరికే ప్రాధాన్యత 

టీకాల కొరత నేపథ్యంలో నిర్ణయం 

నెలాఖరులోగా 15 లక్షల మందికి రెండో డోసు ఇవ్వాలి 

మొదటి డోసు కోసం కొంతకాలం వేచి చూడాల్సిందే 

హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టీకరణ 

ఆక్సిజన్‌ , ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ లో భాగంగా ఈనెల 31 వరకు రెండో డోసు పంపిణీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్‌  కొరత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, తొలిడోసు వ్యాక్సిన్‌  తీసుకోవాలనుకునే వారు కొంత కాలం వేచిచూడాల్సిందేనని స్పష్టం చేశారు. టీకా కోటా సంతృప్తికరంగా వచ్చిన వెంటనే మొదటి డోసు పంపిణీ మొదలుపెడతామన్నారు. మే 31వ తేదీ వరకు రాష్ట్రంలో 15 లక్షల మందికి రెండోడోసు వ్యాక్సిన్‌  ఇవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం తమ వద్ద కేవలం ఒక లక్ష డోసుల టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు.  

గురువారం కోఠిలోని తన కార్యాలయంలో వైద్య విద్య విభాగం సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌  విధించిందని, ప్రజలు సహకరిస్తేనే దీని ఫలితాలు అందుతాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా గుంపులుగా వస్తే కరోనా వ్యాప్తి అదుపులోకి రాకుండా పోతుందన్నారు. లాక్‌డౌన్‌  ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి మినహాయింపు ఉంద న్నారు. తగిన ధ్రువపత్రాలు, ఆధారాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చన్నారు.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ను ఆరు నుంచి 8 వారాల మధ్య, కోవాగ్జిన్‌  4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు కింద తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదన్నారు. ప్రస్తుతం 5,783 ఆక్సిజన్‌  పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని, ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ఆక్సిజన్, రెమిడెసివిర్‌ల గురించి రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆక్సిజన్‌  మానిటరింగ్‌ టీమ్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు.      

>
మరిన్ని వార్తలు