మొబైల్‌ కరోనా పరీక్షాకేంద్రాలుగా వజ్ర బస్సులు

13 Sep, 2020 04:54 IST|Sakshi
వజ్ర బస్సు లోపల ఉన్న ప్రయోగశాలను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌

ప్రయోగాత్మకంగా మార్చిన 3 బస్సులు సూపర్‌ సక్సెస్‌ 

ఒక్కో బస్సు ద్వారా నిత్యం 250 కోవిడ్‌ పరీక్షలు 

మిగతావాటిని కూడా మార్చి జిల్లాలకు పంపాలన్న యోచన 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి గుదిబండగా మారి, నష్టాలు మూటగట్టిన వజ్ర మినీ బస్సులు కోవిడ్‌ పరీక్షల విషయంలో బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రయోగాత్మకంగా ఇటీవల 3 వజ్ర ఏసీ బస్సులను కోవిడ్‌ సం చార పరీక్షాకేంద్రాలుగా మార్చారు. వాటిని రవాణామంత్రి పువ్వాడ అజయ్‌ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. నిత్యం ఈ బస్సుల ద్వారా దాదాపు 750 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనివ్వడంతో మిగతా బస్సులను కూడా సం చార ల్యాబ్‌లుగా మార్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పట్లో కోవిడ్‌ సమస్య సమసిపోయేలా లేకపోవటంతో మిగతాజిల్లాలకు కూడా వీటిని ల్యాబ్‌లుగా మార్చి వినియోగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఒక్కో బస్సు మార్పిడికి రూ.1.15లక్షలు
ఆర్టీసీలో వంద వరకు వజ్ర బస్సులున్నాయి. వీటిల్లో యాక్సిడెంట్లు అయినవి, మరమ్మతులకు నోచుకోనివి పోను 66 బస్సులు కండీషన్‌లో ఉన్నాయి. కోవిడ్‌ సమస్య ఉత్పన్నం కాకముందు వరకు ఆ బస్సులు నడిచాయి. అయితే వాటికి ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండటం,  నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండి భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో గతేడాది సమ్మె తర్వాత ఈ బస్సులను వేలం వేసి అమ్మేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు వీటిని కొనే అవకాశం ఉండటంతో ధర కూడా మెరుగ్గానే పలుకుతుందని ఆర్టీసీ భావించింది. అయితే కోవిడ్‌ సమస్య కారణంగా ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇవి ఏసీ బస్సులు కావటంతో కోవిడ్‌ పరీక్షకు అనువుగా ఉంటాయని భావించి ప్రయోగాత్మకంగా మూడు బస్సులను ఆర్టీసీ వర్క్‌షాపులోనే కోవిడ్‌ సంచార ప్రయోగశాలలుగా మార్చారు.

వాటిని ఖమ్మంకు కేటాయించటం తో అక్కడ సత్ఫలితాలనిస్తున్నాయి. ఒక్కో బస్సుల్లో ముగ్గురు టెక్నీషియన్లు ఉండేలా ఏర్పాటు చేశారు. బస్సు వెలుపల కరోనా అనుమానితులు నిలబడితే, కిటికీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా టెక్నీషియన్లు నమూనాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. ఇది సురక్షితంగా ఉండటంతో టెక్నీషియన్లు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా నమూనాలు సేకరిస్తున్నారు. మినీ బస్సులు కావటంతో ఇరుకు ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోగలుగుతున్నాయి. కోవిడ్‌ సమస్య మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉన్నందున మిగతా 63 బస్సులను కూడా సంచార ప్రయోగశాలలుగా మార్చి ఇతర జిల్లాలకు కేటాయించాలనే సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్‌ సమస్య సమసిన తర్వాత వేలం రూపంలో బస్సులను అమ్మేయబోతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా