నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే..

16 Sep, 2022 19:55 IST|Sakshi

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా  దేశవ్యాప్తంగా సమస్యలు ఎన్నో కొనసాగాయి. మిగిలిన సంస్థానాలతో పాటు హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయడం అంత ఈజీ కాదన్న విషయాన్ని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్ ముందే గుర్తించారు. అందుకే భారత్‌లో విలీనం అయ్యేందుకు.. నిజాం నవాబుకు 3 నెలల సమయం ఇచ్చారు. దీనికి చాలా కారణాలున్నాయి.
చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ 

ముఖ్యంగా నిజాం సంస్థానం దేశంలోనే అత్యంత పెద్ద రాజ్యం. భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం 82 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంది. అంటే ఇప్పటి బ్రిటన్-స్కాట్లాండ్‌ దేశాలకన్నా వైశాల్యంలో పెద్దది. ఇక ప్రపంచంలోనే నిజాం అత్యంత ధనికుడు. 1924లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ తన కవర్‌ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనికుడంటూ అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఫోటో ప్రచురించింది. ఇక నిజాం రాష్ట్రంపై వెంటనే భారత్ సైనికచర్య చేపట్టకపోవడానికి ముఖ్యకారణం... నిజాం ప్రభువుకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఉన్న మతపరమైన అభిమానం.

అందుకే హైదరాబాద్‌ సంస్థానాన్ని చర్చల ద్వారానే విలీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఏడాది పాటు ప్రయత్నించింది. ఏవిధంగానైనా నిజాం రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలని ప్రధాని నెహ్రూ ముందు హోంమంత్రి పటేల్ ప్రతిపాదన పెట్టారు. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌ స్వాతంత్ర్యంగా ఉండటం దేశభద్రతకు ముప్పు అని పటేల్ భావించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంపై సైనికచర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం తలదూర్చే ప్రమాదం ఉందని నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఓ వైపు పాకిస్తాన్‌తో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌లో సైనిక చర్యకు దిగడం సరికాదనే నెహ్రూ సూచనకు పటేల్ సరేనన్నారు. దీంతో తాను స్వతంత్ర్యంగా ఉంటానని ప్రకటించిన నిజాంను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావించారు. చివరికి మూడునెలల పాటు యథాతథ స్థితికి నిజాంతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. అయితే మూడునెలల తరువాత నిజాం తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తేనే ఈ ఒడంబడిక చెల్లుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు నాలుగు దఫాల చర్చల తరువాత నిజాం 1947 నవంబర్‌ 29 ఈ ఒప్పందంపై సంతకం పెట్టాడు.

మరిన్ని వార్తలు