లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’

9 May, 2021 09:09 IST|Sakshi

సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసుకొచ్చారు. వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘నా కొడుకు, కోడల్ని కత్తులతో పొడిచిన తరువాత పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వారికి సకాలంలో వైద్య సేవలు అందలేదు. దీనికి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కారణమని నాకు అనుమానం. మొదట ప్రైవేటు అంబులెన్స్‌ వచ్చినప్పటికీ దాన్ని కాదని 108 వాహనం వచ్చే దాకా కావాలనే ఆలస్యం చేశారు. ఆస్పత్రికి చేరిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న వామన్‌రావుకు వైద్య సేవలు సకాలంలో అంది ఉంటే కొద్ది రోజులైనా బతికేవాడు’ అని తెలిపారు.

‘పుట్ట మధుకు, ఈటలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నా కుమారుడికి వైద్య సేవలు అందలేదు. పంచనామా పోస్టుమార్టం రిపోర్టు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. పెద్దపల్లి ప్రజాప్రతినిధి కూడా ఆసుపత్రికి వచ్చిన వామన్‌రావుకు మందులు ఇవ్వవద్దని చెప్పారు. నిందితులందరికీ చట్ట పరంగా శిక్షలు పడతాయనే విశ్వాసం ఉంది. మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన సత్యనారాయణ ప్రమేయం  ఉన్నట్లు ఏప్రిల్‌ 16న ఐజీ నాగిరెడ్డికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపా. హత్యకు రెక్కీ నిర్వహించడం, అందులో పాల్గొన్న వ్యక్తి పేరును ఇతర వివరాలు తెలియజేశా. వీరందరినీ విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. న్యాయం జరగకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా’ అని తెలిపారు.
చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసుపై సర్కారు ఫోకస్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు