ఏసీపీ నేతృత్వంలో నవీన్‌ హత్యకేసు దర్యాప్తు 

27 Feb, 2023 02:59 IST|Sakshi
హరిహరకృష్ణ, నవీన్‌(ఫైల్‌)   

హరిహరకృష్ణతోపాటు స్నేహితులను ప్రశ్నించేందుకు సిద్ధమైన పోలీసులు 

నిందితుడి కస్టడీ కోసం నేడు కోర్టులో పిటిషన్‌ వేసేందుకు ఏర్పాట్లు 

అబ్దుల్లాపూర్‌మెట్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఇంజనీరింగ్‌ విద్యార్థి నవీన్‌ హత్యకేసులో దర్యాప్తు అధికారిగా వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన నేతృత్వంలో పలు పోలీసు బృందాలు లోతుగా దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే విజయవాడ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే నవీన్, హరిహరకృష్ణతోపాటు ఇంకా ఎంతమంది అక్కడికి వ చ్చారనేది తేలనున్నట్టు పోలీసులు చెప్తున్నారు.

ఇక నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, బాటసింగారం ప్రాంతాలపై హరిహరకృష్ణకు ముందే స్పష్టమైన అవగాహన ఉన్నట్టు భావిస్తున్నారు. శివారు ప్రాంతాలు కావడం, పదుల సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండటంతో.. నిర్మానుష్య ప్రాంతాలను ఎన్నుకుని గుట్టుచప్పడు కాకుండా గంజాయి, డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం. నవీన్, హరిహరకృష్ణ, వారి స్నేహితులు గతంలో గంజాయికోసం ఈ ప్రాంతాలకు వచ్చి ఉంటారని, ఈ క్రమంలోనే హత్యకు నిర్మానుష్య ప్రాంతాన్ని సులువుగా ఎంచుకుని ఉంటాడని భావిస్తున్నారు. 

నిందితుడి కస్టడీ కోసం నేడు పిటిషన్‌ 
ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమ వారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ హత్యకు సంబంధించి హరిహరకృష్ణ, నవీన్‌ స్నేహితులను కూడా విచారించనున్నట్టు సమాచారం. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. ఆ తర్వా త నవీన్‌ స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడిన ఆడి యో రికార్డులు బయటికి వచ్చాయి. హరిహరకృష్ణ  హత్యకు పాల్పడిన ఆందోళన, భయం వంటివేమీ లేకుండా మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నిందితుడి అన్నకూ నేర చరిత్రే.. 
ఖిలా వరంగల్‌: స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్‌ ప్రాంతం. తండ్రి స్థానికంగా ఆర్‌ఎంపీ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హరిహరకృష్ణ అన్న ముఖేశ్‌ గతంలో ఓ హత్యానేరంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు హరిహరకృష్ణ తాను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్యచేయడం కరీమాబాద్‌ ప్రాంతంలో కలకలం రేపింది. 

నవీన్‌ తల్లిదండ్రులు మమ్మల్ని క్షమించాలి 
ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మా యిని ప్రేమించడం దురదృష్టకరమని.. అయి నా తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని నిందితుడు హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్‌ పేర్కొన్నారు. తన కొడుకును ఉన్నతంగా చూడాలని అనుకున్నానని, కానీ ఇలా అవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని వివరించారు. నవీన్‌ తల్లిదండ్రులకు తీరని లోటు జరిగిందని.. వారు తన కుటుంబాన్ని పెద్ద మనసుతో క్షమించాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు