Vande Bharat Express Train: రూట్లు రెడీ.. నాగ్‌పూర్‌– సికింద్రాబాద్‌ మార్గంలో వందే భారత్‌ రైలు?

17 Jan, 2023 13:31 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్‌ రైలు’ను పూర్తిస్థాయిలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్‌– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పట్టాలపైనా వందేభారత్‌ పరుగులు తీస్తుందా? అన్న సామాన్యుల అనుమానాలకు దక్షిణ మధ్య రైల్వే తెరదించింది.

పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రైల్వే లైను ఉంది. సిరిసిల్లకు రూటు ప్రగతిలో ఉంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్‌కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచారు. పెద్దపల్లి– కరీంనగర్, కరీంనగర్‌– జగిత్యాల, జగిత్యాల–నిజామాబాద్‌ రూట్లలో ఈ రైలును నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంది. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాలలోని నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది.

అన్ని డివిజన్లలో..
దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్‌ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్‌ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు.

అందుకు అనుగుణంగా రైలు పట్టాల సామర్థ్యం పెరగాలి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల చేపట్టిన అప్‌గ్రేడేషన్‌ పనులతో ఇక్కడ గరిష్ట వేగం 130 కి.మీలకు చేరుకుంది. తెలంగాణలోని మూడు డివిజన్లలో వందే భారత్‌ రైలును నడపాల్సి వస్తే.. చాలా సెక్షన్లలో 130 కి.మీ గరిష్ట వేగంతో నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

గరిష్ట వేగం 130 కి.మీ.. కనిష్టవేగం 30.కి.మీ
ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్‌లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్‌ అప్‌గ్రేడేషన్‌తోపాటు లెవెల్‌ క్రాసింగ్స్, రైల్‌ ట్రాఫిక్‌ కూడా ప్రభావం చూపుతుంది.

అత్యాధునిక సౌకర్యాలు..
ఆటోమేటిక్‌ డోర్స్, స్మోక్‌ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్‌ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్‌ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్‌– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది.

దేశవ్యాప్తంగా దాదాపు 20కిపైగా ప్రాంతాల నడుమ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో హైదరాబాద్‌– తిరుపతి, హైదరాబాద్‌– బెంగళూరు, హైదరాబాద్‌– నాగ్‌పూర్‌ మార్గాలు ఉండటం విశేషం.

రూటు    స్పీడు
సికింద్రాబాద్‌– బల్లార్షా  130 కి.మీ.
ఖాజీపేట–కొండపల్లి  130 కి.మీ. 
సికింద్రాబాద్‌– ఖాజీపేట  130 కి.మీ. 
మానిక్‌నగర్‌– విరూర్‌ (3వలైన్‌) 110 కి.మీ.
మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్‌) 110 కి.మీ.
మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్‌) 100 కి.మీ.
పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్‌) 110 కి.మీ. 
రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్‌) 90 కి.మీ.
బిజిగిరి షరీఫ్‌– ఉప్పల్‌ (3వలైన్‌)  100 కి.మీ. 
పెద్దపల్లి– కరీంనగర్‌     100 కి.మీ. 
కరీంనగర్‌– జగిత్యాల(లింగంపేట)  90 కి.మీ.
జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్‌ 100 కి.మీ
మేడ్చల్‌– మనోహరాబాద్‌ 110 కి.మీ
మల్కాజిగిరి– మౌలాలి కార్డ్‌లైన్‌ సెక్షన్లలో 30 కి.మీ.

ఈ ప్రాంతానికి ఎంతో మేలు 
‘వందేభారత్‌’ రైలును బల్లార్షా– కాజీపేట మార్గంలో నడపాలి. నాగ్‌పూర్‌– సికింద్రాబాద్‌ మార్గంలో వందేభారత్‌ రైలు ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గంలో రైలు వస్తే.. రామగుండం లేదా మంచిర్యా లకు హాల్టింగ్‌ కల్పిస్తే.. కోల్‌బెల్ట్‌ పారిశ్రామిక ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
– కామని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త

రవాణా సదుపాయాలకు పెద్దపీట 
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రవాణా సదుపాయాలకు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందనడానికి వందేభారత్‌ రైలే పెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు దేశంలోనే అత్యధిక వేగంతో వెళ్లడం విశేషం. భవిష్యత్తులో దేశంలోని ముఖ్యప్రాంతాలకు దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలకు సైతం త్వరలో దీని సేవలు అందుతాయి.
– బండి సంజయ్, కరీంనగర్‌ ఎంపీ 

మరిన్ని వార్తలు