ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను!

26 Mar, 2023 04:16 IST|Sakshi

రెస్టారెంట్‌ల వ్యాపారంలోకి దిగుతున్నవారు.. భోజన ప్రియుల్ని, ఇంట్లో వంటకు విరామం ఇచ్చి వెరైటీగా హోటల్లో తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించేవారు కొందరైతే, వినూత్నమైన ఆలోచనలతో థీమ్‌ బేస్డ్‌ రెస్టారెంటుల ఏర్పాటు వైపు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం..తమ రెస్టారెంట్లు, టేక్‌ అవేలు, కర్రీ, బిరియానీ పాయింట్లకు..ప్రత్యేక ప్రాంతం, వంటకం, రుచి, అంకెలు, అక్షరాలు ఆధారంగా పేర్లు పెట్టేస్తున్నారు. మనం రోజువారీ ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు కూడా రెస్టారెంట్ల పేర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో కొన్ని సరదాగా ధ్వనించే, నవ్వు పుట్టించే పేర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ తరహా ట్రెండ్‌ ఇటీవల బాగా పెరిగిపోయింది.   
 – సాక్షి, సిటీడెస్క్‌

ఉడిపి, విలాస్, మిలటరీ స్థానంలో.. 
► గతంలో చాలా హోటళ్లకు అన్నపూర్ణ, అజంతా లాంటి సాధారణ పేర్ల తర్వాత ఉడిపి అనో, విలాస్‌ అనో, మిలటరీ హోటల్‌ అనో ఉండేది. దేవుళ్లు, కుటుంబసభ్యులు, పిల్ల లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు కలిసొచ్చేలా పెట్టేవారు. ఇప్పుడ లాంటి పేర్లకు చాలావరకు కాలం చెల్లింది. కొత్త, వింతైన, సరదా పేర్లదే హవా. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అలాంటి పేర్ల మీద ఓ లుక్కేద్దామా..

అన్ని రుచులూ ఇక్కడే.. 
ఉప్పు కారం (కొండాపూర్‌), పెప్పర్‌ అండ్‌ సాల్ట్‌ (షేక్‌పేట్‌), సిల్వర్‌ సాల్ట్‌ (బంరాహిల్స్‌), సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ (లక్డీకాపూల్‌), టామరిండ్‌ ట్రీ (చింతచెట్టు (సికింద్రాబాద్‌), టామరిండ్‌ (మణికొండ), రాయలసీమ రుచులు (చాలాచోట్ల ఉంది), తెలు గింటి రుచులు (కూకట్‌పల్లి), రాజుగారి రుచులు (కొత్తగూడ), గోదావరి రు చులు (జూబ్లీహిల్స్‌), నెల్లూరు రుచులు (మోతీనగర్‌), రాయలవారి రుచులు (యూసుఫ్‌గూడ), కోనసీమ వంటిల్లు (కూకట్‌పల్లి), కృష్ణపట్నం (బంజారాహిల్స్‌), సింప్లీ సౌత్‌ (జూబ్లీహిల్స్‌), సింప్లీ తెలంగాణ (కొత్తపేట్‌), మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి).  

వంటకాలనూ వదలకుండా..
కోడికూర–చిట్టిగారె (జూబ్లీహిల్స్, కొండాపూర్‌), దిబ్బరొట్టి (మణికొండ), రాజుగారి పులావ్, పొట్లం పులావ్‌ (శ్రీనగర్‌ కాలనీ), పకోడా పాపారావు (కేపీహెచ్‌బీ ఫేజ్‌–1), ఉలవచారు (జూబ్లీహిల్స్‌), ముద్దపప్పు ఆవకాయ అండ్‌ మోర్‌ (గచ్చిబౌలి), నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (కేపీహెచ్‌బీ, మణికొండ), పంచెకట్టు దోశ (ప్రగతినగర్‌), పులిహోరాస్‌ (మణికొండ), బిరియానీ వాలా, బిర్యానీ హౌస్‌ (బంజారాహిల్స్‌), కిచిడీ ఎక్స్‌ప్రెస్‌ (మాదాపూర్‌). 

ఆహా.. ఏమి పేర్లు.. 
► వివాహ భోజనంబు (సికింద్రాబాద్, బంజారాహిల్స్‌), వియ్యాలవారి విందు (కొత్త పేట్‌), అద్భుత: (దిల్‌సుఖ్‌నగర్‌), తినే సిపో (కొంపల్లి), తిన్నంత భోజనం (ఉప్ప ల్, సికింద్రాబాద్‌), దా–తిను (హఫీజ్‌పేట), పొట్ట నింపు (గుండ్ల పోచంపల్లి), కడుపు నిండా (ఉప్పల్‌), భలే బంతి భోజనం (మియాపూర్‌), రా బావా తిని చూడు (కూకట్‌పల్లి), సెకండ్‌ వైఫ్, పందెం కోడి (వెంగళరావునగర్‌), అంతేరా (జూబ్లీహిల్స్‌), ఆకలైతుందా?.. పంచభక్ష్య (కూకట్‌పల్లి), మాయా బజార్‌ (కార్ఖానా), పందెం కోడి (వెంగళరావునగర్‌), విలేజ్‌ వంటకాలు, ఆహా (షేక్‌పేట), పాకశాల (కూకట్‌పల్లి), విస్తరాకు, అరిటాకు భోజనం (అమీర్‌పేట), లలితమ్మగారి భోజనం (బంజారాహిల్స్‌), బాబాయ్‌ భోజనం (నేరేడ్‌మెట్‌), తాళింపు (అమీర్‌పేట), గోంగూర (బంజారాహిల్స్‌), ఘుమఘుమలు (మాదాపూర్‌). 

ప్రాంతీయతకు ప్రతిరూపం..‘అంతేరా’ 
రెస్టారెంట్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రాంతీయత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ’ఆంధ్రా తెలంగాణ రాయలసీమ’ సమ్మేళనంతో ఆ పేర్ల లోని మొదటి అక్షరాలతో ‘అంతేరా’పేరును ఎంచుకున్నాం. ఈ మూడు ప్రాంతాల రుచులను అందిస్తున్నాం.  
– నిర్వాహకులు,అంతేరా రెస్టారెంట్‌

థీమ్‌తో ఫామ్‌లోకి.. 
► కొందరు నిర్వాహకులు థీమ్‌/కాన్సెప్ట్‌ బేస్డ్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ భోజనప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. రైలు, గుహలు, అడవులు, పల్లె వాతావరణం, జైళ్లు, బీచ్‌ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్లు వెలుస్తుండటం గమనార్హం. గుహను తలపించేలా ఏర్పాటు చేసిన గుఫా ఓహ్రీస్‌ (బషీర్‌బాగ్‌), అడవి వాతావరణాన్ని తలపించేలా ఏర్పా టు చేసిన మారేడుమిల్లి (గచ్చి బౌలి), జైలును గుర్తుకు తెచ్చే జైల్‌ మండి (చాలాచోట్ల ఉంది).. ఖైదీ కిచెన్‌ (బంజారాహిల్స్‌), రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 (బంజారాహిల్స్‌) ఈ కోవలోనివే. ఇక బొమ్మ రైలు మీద భోజనం రావడం (ప్లాట్‌ఫామ్‌ 65), రోబో ఆహారం సర్వ్‌ చేయడం (రోబో కిచెన్, జూబ్లీహిల్స్‌) లాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్లు కూడా నగరంలో వెలిసి కస్టమర్లను అలరిస్తున్నాయి. 

వియ్యాలవారి విందు. బహు పసందు  
మా హోటల్‌లో అన్నీ ప్రత్యేక వంటకాలే. తెలుగు రుచులు మా సొంతం. వెరైటీగా ఉంటుందని వియ్యాలవారి విందు పేరు పెట్టాం. అందరూ వియ్యాల వారిని ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నాం.     
– సీహెచ్‌ఆర్‌వీ నర్సింహారెడ్డి, వియ్యాల వారి విందు నిర్వాహకుడు 

బావలకు ఇచ్చే మర్యాదే ఇస్తాం 
ఇంటికి వచ్చిన బావకి ఏ విధంగా మర్యాద చేస్తారో అదే విధంగా మా హోటల్‌కు వచ్చినవారికి ఇస్తాం. ఈ ఆలోచనతోనే ‘రా బావా.. తిని చూడు’అని మా హోటల్‌కి పేరు పెట్టాం.  
– రామకృష్ణారెడ్డి, ‘రా బావ తిని చూడు’యజమాని 

అక్షరాలు, నంబర్లు.. 
► మండీ 36 (జూబ్లీహిల్స్‌), 1980 మిలటరీ హోటల్‌ (మణికొండ, సైనిక్‌పురి),అంగారా 5 (బంజారాహిల్స్‌), శ్యాల 95ఏ (మాదా పూర్‌), వై2కే (పంజగుట్ట), ఎన్‌ గ్రాండ్‌ (కార్ఖానా), ఎం గ్రాండ్‌ (వనస్థలిపురం), బీ ప్లేస్‌ (అయ్యప్ప సొసైటీ), డీ కార్పెంటర్‌ (మాసబ్‌ట్యాంక్‌), ఏ2జెడ్‌ (జీడిమెట్ల). 

కడుపారా ’తిన్నంత భోజనం’.. 
‘తిన్నంత భోజనం’లో ఆత్మీయత, అనుబంధం కనిపిస్తుంది. మా వద్దకు వచ్చే కస్టమర్‌ మాకు బంధువుతో సమానం. చుట్టాల ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. మా రెస్టారెంట్‌కు వచ్చినా అంతే.  
– గాంధీ మిర్యాల, తిన్నంత భోజనం వ్యవస్థాపకులు  

>
మరిన్ని వార్తలు