TSRTC: ఒక్కరు మినహా అందరు ఈడీల బదిలీ

22 Mar, 2022 20:26 IST|Sakshi

తెలంగాణ ఆర్టీసీలో ప్రక్షాళన 

11 మంది ఆర్‌ఎంలకు స్థానచలనం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో సమూల ప్రక్షాళనకు ఎండీ సజ్జనార్‌ నడుం బిగించారు. ఒక్కరు మినహా అందరు ఈడీలనూ బదిలీ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రీజినల్‌ మేనేజర్లను మార్చేశారు. 11 మంది ఆర్‌ఎంలు అటూ ఇటూ మారిపోయారు. త్వరలో మరో బదిలీ ఉత్తర్వు కూడా వెలువడనుంది. డీవీఎంలను, దాదాపు 70 మంది డీఎంలను బదిలీ చేయనున్నట్టు సమాచారం. డీవీఎం పోస్టులతో ఉపయోగం లేదని, ఆ పోస్టుల్లోని అధికారులను వేరే అవసరాలకు వాడుకోవాలని ఎండీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కొందరు తప్ప మిగతా డీవీఎంలను మారుస్తారని సమాచారం. 

ఆపరేషన్స్‌ ఈడీగా మునిశేఖర్‌ 
కొంతకాలంగా డిపో స్థాయి నుంచి బస్‌భవన్‌ వరకు అన్ని విభాగాలను సమీక్షిస్తున్న సజ్జనార్‌.. ప్రతి విభాగం, ఆయా విభాగాల అధికారుల పనితీరుపై పూర్తి అవగాహనకొచ్చారు. పనితీరు సరిగా లేని వారిని కీలక పోస్టుల నుంచి తప్పించి మెరుగ్గా ఉందని భావించిన వారికి ముఖ్య పోస్టులను అప్పగించారు. సర్వీస్‌లో సీనియరే అయినా ఈడీ పోస్టు నిర్వహణలో జూనియర్‌గా ఉన్న మునిశేఖర్‌కు అత్యంత కీలకమైన, ఆర్టీసీకి ఆయువుపట్టుగా నిలిచే ఆపరేషన్స్‌ విభాగాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, కరీంనగర్‌ జోన్ల ఈడీగా ఉన్నారు. ఇంతకాలం ఆ పోస్టు నిర్వహించిన యాదగిరికి గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ బాధ్యతలు అప్పగించారు. యాదగిరి పనితీరుపై సజ్జనార్‌ అసంతృప్తితో ఉన్నట్టు బస్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్‌: ఉందానగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు, జీఎమ్మార్‌ అంగీకరిస్తే..)

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీగా ఉన్న వెంకటేశ్వర్లును కరీంనగర్‌ జోన్‌ ఈడీగా మార్చారు.  గతంలో ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు రెండూ యాదగిరి వద్ద ఉండేవి. అందులో అడ్మినిస్ట్రేషన్‌ విభాగాన్ని ఏ ఈడీకి అప్పగించలేదు. బదిలీల వ్యవహారాలు ఈ విభాగం పరిధిలోనే ఉంటాయి. దీన్ని తనే స్వయంగా పర్యవేక్షించాలని ఎండీ సజ్జనార్‌ నిర్ణయించారు. బదిలీలు జరిగిన విభాగాల్లో ఎవరికీ కేటాయించనివి ఎండీ వద్దే ఉంటాయని బదిలీ ఆదేశాల్లో స్పష్టం చేశారు. (క్లిక్‌: ఐటీ కారిడార్‌లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?)

మరిన్ని వార్తలు