TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం 

23 May, 2021 09:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్స్‌లర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల మేరకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియలో భాగంగా పేర్లను సిఫారసు చేశారు. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యమైనా నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసి గవర్నర్‌ ఆమోదం కోసం సిఫారసు చేశారు.

వీసీల నియామకానికి శనివారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని వీసీలుగా నియమించింది. వీటికి సంబంధించి యూనివర్సిటీ వారీగా ఉన్నత విద్యా శాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బాసరలోని ట్రిపుల్‌ఐటీకీ ప్రభుత్వం త్వరలోనే వీసీని నియమించనుంది. ట్రిపుల్‌ ఐటీకి ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. 

ముగ్గురికి రెండోసారి అవకాశం.. 
వీసీలుగా నియమితులైన వారిలో ముగ్గురికి రెండోసారి అవకాశం దక్కించింది. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ కె.సీతారామరావు ఇంతకుముందు కూడా అదే యూనివర్సిటీ వీసీగా పని చేశారు. 2016 జూలై నుంచి 2019 జూలై వరకు ఆయన వీసీగా పని చేశారు. 
ప్రొఫెసర్‌ కవిత దర్యాణి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీకి (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) రెండోసారి వీసీగా నియమితులయ్యారు. అలాగే ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి ఉమ్మడి ఏపీలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీగా పని చేశారు. ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌గా సేవలందించిన ప్రొఫెసర్‌ సంకసాల మల్లేశ్‌ తాజాగా శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ముగ్గురికి వీసీలుగా అవకాశం దక్కింది. ప్రొఫెసర్‌ టి.రమేశ్, ప్రొఫెసర్‌ సీతారామరావు, ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వారే. 

రెండేళ్ల తర్వాత నియమకాలు.. 
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు 2016లో ప్రభుత్వం వీసీలను నియమించింది. వారందరి పదవీ కాలం 2019లో ముగిసింది. దీంతో ప్రభుత్వం వీసీల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని వర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాల చెందిన 984 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. వాటిన్నింటినీ ప్రభుత్వం క్రోడీకరించి సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో సెర్చ్‌ కమిటీల సమావేశాలు ఆలస్యయ్యాయి. ఎట్టలకేలకు గత ఫిబ్రవరిలో సెర్చ్‌ కమిటీల సమావేశాలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం ముగ్గురు చొప్పున పేర్లను గవర్నర్‌ ఆమోదానికి పంపించింది. 

ప్రొఫెసర్‌ కవితా దర్యాణి
ప్రొఫెసర్‌ కవితా దర్యాణి.. జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఆర్కిటెక్చర్‌ విభాగం లెక్చరర్‌గా 1985లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2002లో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ లో అడినషల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా, 2004లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. అనంతరం మాసబ్‌ట్యాంక్‌ జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్‌గా, 2013 నుంచి 2016 వరకు ఇదే యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, 2017లో వీసీగా పదోన్నతి పొందారు. 

తాటికొండ రమేశ్‌
వరంగల్‌లోని గోవిందరాజుగుట్ట ప్రాంతానికి చెందిన తాటికొండ రమేష్‌ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి రామయ్య ఆజాంజాహీ మిల్లులో కార్మికుడిగా పనిచేయగా, తల్లి లక్ష్మమ్మ మద్రాస్‌ చక్కెర బీడీ కంపెనీలో బీడీలు చుట్టేవారు. ఆమెతో కలసి నాలుగో తరగతి సమయం నుంచే తల్లితో పాటు బీడీలు చుట్టేవారు. హైస్కూల్‌ విద్యతో పాటు ఇంటర్, డిగ్రీ వరంగల్‌లోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1987లో ఎంఏ సోషియాలజీ, 1990లో ఎంఫిల్, 2009లో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆయన.. 1992లో కేయూ సోషియాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిర్మల్‌ పీజీ సెంటర్‌లో 1991లో సోషియాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కేయూలో సోషియాలజీ విభాగానికి అధిపతిగా, బీఓఎస్‌గా, సోషల్‌ సైన్స్‌ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కేయూ అకడమిక్‌ ఆడిట్‌ డీన్‌గా ఉన్న ఆయన 20కి పైగా పుస్తకాలు రచించారు.

తంగెడ కిషన్‌రావు
కరీనంగర్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ తంగెడ కిషన్‌రావు 1973లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. 1991లో అదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1974 నుంచి 1984 వరకు భువనగిరిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పని చేశారు. అప్పటి నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో పని చేశారు. 1991 నుంచి 1999 వరకు ఉస్మానియాలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, 1999 నుంచి ప్రొఫెసర్‌గా పని చేశారు. 2006 నుంచి బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గానూ పని చేశారు.

ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ యాదవ్‌
ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ యాదవ్‌.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1990లో అదే యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా నియమితులయ్యారు. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ ఇన్‌ అకడమిక్‌ ప్రోగ్రాంలో శిక్షణ పొందారు. ఓయూ పోస్టు గ్రాడ్యుయేట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా గతంలో పని చేశారు. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. మహత్మాగాంధీ యూనివర్సిటీలో సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా, సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కోఆర్డినేటర్‌గా పని చేశారు. నిజాం కాలేజీ, ఓయూ పీజీ కాలేజీల్లోనూ ఆయన సేవలు అందించారు.


సీతారామారావు 
వరంగల్‌ జిల్లా హన్మ కొండకు ప్రొఫెసర్‌ సీతా రామారావు కేయూ యూని వర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభా గంలో 1977లో పీజీ, 1981లో ఎంఫిల్, 1999లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1978లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులైన ఆయన ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, సోషల్‌ సైన్స్‌ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశాక 2016లో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా నియమితులై మూడేళ్ల పాటు కొనసాగారు.

ప్రొఫెసర్‌ సంకసాల మల్లేశ్‌
కరీంనగర్‌ జిల్లాలోని హన్మాజ్‌పేట్‌ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రొఫెసర్‌ సంకసాల మల్లేశ్‌ ఉన్నత స్థాయికి ఎదిగారు. పదో తరగతి వరకు కరీంనగర్‌ జిల్లాలోనే చదువుకున్న ఆయన బాబు జగ్జీవన్‌రామ్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్‌ పూర్తి చేశారు. ఇంటర్నేషనల్‌ జర్మనీ ఫెలోషిప్‌ అందుకుని అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1992లో లెక్చరర్‌గా నియమితులైన ఆయన 1994లో యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీ ప్రిన్సి పాల్‌గా పని చేశారు. 2010లో యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా, 2012 నుంచి 2014 వరకు ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేశారు.

లక్ష్మీకాంత్‌ రాథోడ్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌.. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకానమిక్స్‌ పూర్తి చేశారు. బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేసిన ఆయన.. 2006లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎయిడెడ్‌ కాలేజీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి.. ఐదేళ్ల తర్వాత ఉస్మానియాలో ఫ్యాకల్టీగా చేరారు. అప్పటి నుంచి 2020 ఆగస్టు వరకు ఫ్యాకల్టీ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌గా పని చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. 


సీహెచ్‌ గోపాల్‌రెడ్డి 
కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి.. వరంగల్‌ కాకతీయ యూని వర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1990లో అదే యూనివర్సిటీ ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పని చేశారు. నల్లగొండ పీజీ కాలేజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా, సైఫాబాద్‌ యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ ఫిజిక్స్‌ హెడ్‌గా మూడేళ్లు పని చేశారు. డీన్‌గా, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌గానూ సేవలందించారు. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితు లయ్యారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.


డి.రవీందర్‌గుప్తా
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌కి చెందిన ప్రొఫెసర్‌ డి.రవీందర్‌గుప్తా తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాసిన 172 ఆర్టికల్స్‌ అంతర్జాతీయ జర్నల్స్‌లో పబ్లిష్‌ అయ్యాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో 1994లో బాయ్‌స్కాస్ట్‌ ఫెలోషిప్‌ పొందారు. 1996లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాయల్‌ సొసైటీ విజిటింగ్‌ ఫెలోషిప్‌ పొందారు. సైన్స్‌ టెక్నాలజీ విభాగంలో 1994లో ఏపీజే అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డును అందుకున్నారు. యూజీసీ కెరీర్‌ అవార్డును పొందారు.

కట్టా నర్సింహారెడ్డి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌కు చెందిన కట్ట నర్సింహారెడ్డి.. మహాత్మాగాంధీ యూని వర్సిటీ వీసీగా 2011 నుంచి 2014 వరకు పని చేశారు. అంతకుముందు ఉస్మానియా యూని వర్సిటీలో ఫిజిక్స్‌ డిపార్ట్‌మెం ట్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2013లో పదవీ విరమణ పొం దారు. ఆయన తండ్రి రామ చంద్రా రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు.
చదవండి: చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌ త్వరగా తీసుకురండి: గవర్నర్‌ తమిళిసై 

 

మరిన్ని వార్తలు