లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: చుక్కల్లో ‘కూరలు’

18 May, 2021 04:41 IST|Sakshi

లాక్‌డౌన్‌తో నగర మార్కెట్లకు తగ్గిన సరఫరా 

అదను చూసి ధరలు పెంచుతున్న వ్యాపారులు 

సరైన రవాణా లేక స్థానికంగానే అమ్ముకుంటున్న రైతులు 

సాక్షి, హైదరాబాద్‌: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో మార్కెట్‌కు సరిపడా రాకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు లాక్‌డౌన్‌ సడలింపు సమయం నాలుగు గంటలే ఉండటంతో రైతులు కూడా ఇంటికి వెళ్లాలనే తొందరలోనే తక్కువ ధరకే మార్కెట్‌లో వ్యాపారులకు విక్రయించేసి వెళ్లిపోతున్నారు. అయితే, రైతుల నుంచి చౌకగా కొనుగోలు చేసిన కూరగాయలను రిటైల్‌ మార్కెట్‌లో మూడింతలు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బంగాళదుంప, క్యాబేజీ, కీర, బీట్‌రూట్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి.  

స్థానికంగానే అమ్ముకుంటున్న రైతులు 
కూరగాయల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ,  గ్రామీణా ప్రాంతాల నుంచి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు రైతులకు భారంగా మారాయి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎన్టీఆర్‌ నగర్, మాదన్నపేట, మీరాలం, మోండా మార్కెట్లకు నగర శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇప్పుడు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం.. వచ్చినా వెనువెంటనే వెనక్కి వెళ్లే పరిస్థితి కానరాకపోవడంతో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకుంటున్నారు. దీని ప్రభావం హైదరాబాద్‌ మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలోనే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయని అంటున్నారు.  

తగ్గిన సరఫరా 
ప్రతి రోజు జంటనగరాలకు 3వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఇందులో సగం కూడా మార్కెట్లకు రావడంలేదు. మార్కెటింగ్‌ శాఖ గణాంకాల ప్రకారం బోయిన్‌పల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో సగటున 1,500 క్వింటాళ్ల కూరగాయలు వచ్చేవి. శనివారం కేవలం వేయి క్వింటాళ్లు మ్రాతమే సరఫరా అయింది. ఇదే సీను మిగతా మార్కెట్లల్లోనూ కనిపిస్తోంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు