ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్‌ ట్రాకింగ్‌

20 Mar, 2023 08:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, చిన్నారుల భద్రత కోసం అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను నిఘా చట్రంలోకి తేవాలన్న ప్రతిపాదన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి పూట ఆలస్యంగా క్యాబ్‌లో వెళ్లేందుకు భయపడాల్సి వస్తోందని, ఇలాంటి వాహనాలపై పోలీసులు లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నిఘా ఉంటే బాగుంటుందని ఇటీవల ఓ ప్రయాణికురాలు ట్వీట్‌ చేశారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన వెహికిల్‌ ట్రాకింగ్‌ అంశాన్ని పరిశీలించాలంటూ డీజీపీకి సూచించారు. ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత అన్ని ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్‌ ఆధారిత వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖ కూడా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్‌లో తిరిగే క్యాబ్‌లు, ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, తదితర అన్ని రకాల వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అది అమలుకు నోచలేదు. 

దారుణం జరగినప్పుడే..
ఢిల్లీలో 2012లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళ ప్రజా రవాణా వాహనాల వినియోగంపై భయాందోళనలను పెంచింది. క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణం ఏ మాత్రం క్షేమం కాదనే భావన నెలకొంది. ఆ తర్వాత కొద్దిరోజులకే హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మాదాపూర్‌ నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళ్లే సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత జరిగిన మరికొన్ని ఘటనలు రాత్రివేళ ప్రయాణించే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

ఈ నేపథ్యంలోనే ప్రతి వాహనంపై నిఘా తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 2017లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు చట్టాన్ని రూపొందించింది. ప్రజా రవాణా వాహనాలపై నిఘా ఏర్పాటు చేసేందుకు నిర్భయ నిధి కింద కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు చేయవచ్చునని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నిర్భయ నిధులు వచ్చాయి. కానీ మరోమారు ఈ అంశం అటకెక్కింది. నిఘా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. గ్రేటర్‌లో తిరిగే క్యాబ్‌లలో ఆయా సంస్థలకు చెందిన వెహికిల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ అవి పోలీసు నిఘా పరిధిలో లేవు. దీంతో ఫిర్యాదులొస్తే తప్ప పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది. మరోవైపు క్యాబ్‌ డ్రైవర్‌లు తమ వాహనాల్లోని డివైస్‌లను స్విచ్‌ ఆఫ్‌ చేస్తే వాటిని ట్రాక్‌ చేయడం కష్టంగా మారుతోంది. 

ట్రాకింగ్‌తో పక్కా నిఘా
ప్రతి వాహనంలో జీపీఎస్‌ వెహికిల్‌ ట్రాకింగ్‌ డివైస్‌ను ఏర్పాటు చేయడం వల్ల దాని కదలికలపైన కచ్చితమైన నిఘా ఉంటుంది.  ట్రాకింగ్‌ డివైస్‌ నుంచి ప్రతి 10 సెకన్లకు ఒకసారి వాహనం కదలికలు కమాండ్‌ కేంద్రానికి అందుతాయి. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రయాణికులు ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే కమాండ్‌ కంట్రోల్‌లో అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు.

ప్రస్తుతం వాహనాల్లో అమర్చిన డివైస్‌లను తొలగించేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టంగా ఏర్పాటు చేసే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ప.బెంగాల్లో మైనింగ్‌ వాహనాలకు ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కొన్ని బస్సులకు ఏర్పాటు చేసింది. రూ.5000 లోపు లభించే ట్రాకింగ్‌ డివైస్‌లను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు, యువతులు, విద్యార్ధినులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందజేయవచ్చు. 

ఆచరణ సాధ్యమే 
వెహికిల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి వాహనంలో ఈ డివైస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఆదేశిస్తే ఆచరణసాధ్యమే.
– రమేశ్, సంయుక్త రవాణా కమిషనర్, ఐటీ విభాగం 

తక్కువ ఖర్చుతో భద్రత 
వెహిల్‌ ట్రాకింగ్‌ డివైస్‌లు ఏ మాత్రం భారం కాదు. కేవలం నాలుగైదు వేల రూపాయల ఖర్చుతో మంచి భద్రత కలి్పంచవచ్చు. ఇప్పుడు మరింత కచి్చతమైన ప్రమాణాలతో రూపొందించిన డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వాటిని వాహనంలో ఏర్పాటు చేస్తే తొలగించడం సాధ్యం కాదు.  
– ఆర్‌.ఎల్‌ రెడ్డి, సాంకేతిక నిపుణులు
చదవండి: 'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు'

మరిన్ని వార్తలు