రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్‌

25 Oct, 2021 02:35 IST|Sakshi
ఎంఓయూ అనంతరం కరచాలనం చేస్తోన్న జయేశ్‌రంజన్, వెమ్‌ టెక్నాలజీ అధ్యక్షుడు వెంకట్‌రాజు. చిత్రంలో మంత్రి కేటీఆర్, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ వీకే సారస్వత్‌ తదితరులు

ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ వెల్లడి 

‘రక్షణ’ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి

జహీరాబాద్‌ సమీపంలో  వెమ్‌ టెక్నాలజీస్‌ ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ 

వెమ్‌ టెక్నాలజీస్‌కి, రాష్ట్ర  ప్రభుత్వానికీ మధ్య కుదిరిన ఒప్పందం

తయారీరంగానికి ఊతం: సతీశ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: డజనుకు పైగా డీఆర్‌డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్‌ రక్షణ రంగ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్‌) టెక్నాలజీస్‌ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్‌ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ లాక్‌హీడ్‌ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్‌ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్‌ఎంఎస్‌ఈ) ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్‌ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు.

క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్‌ టెక్నాలజీస్‌ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్‌ టెక్నాలజీస్‌ కంపెనీ భారతదేశ లాక్‌హీడ్‌ మార్టిన్‌ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు.  

లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్‌ రెడ్డి 
రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్‌ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్‌ సామ్‌ వంటి అనేక క్షిపణులు  ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు.

వెమ్‌ టెక్నాలజీస్‌ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్‌ రాజు  
కూకట్‌పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్‌ టెక్నాలజీస్‌ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్‌’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్‌ టెక్నాలజీస్‌ అధ్యక్షుడు వెంకట్‌ రాజు అన్నారు. భారత్‌లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్‌ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్‌ సమీపంలోని యల్‌గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్‌ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు.      

మరిన్ని వార్తలు