‘త్వరలో లక్ష ఇళ్ల పంపిణీ’

24 Mar, 2021 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో 1.03 లక్షల డబుల్‌ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 52 వేల ఇళ్లు పూర్తి చేశామని, వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నాయని, మరో 1.03 లక్షల ఇళ్లు 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని సభకు తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలా ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా ఇళ్లను కట్టించి ఇచ్చే పథకం లేదన్నారు.

ఇప్పటివరకు ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.10,054 కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో రూ.8,743 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులని, కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రూ.1,311 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బిల్లులు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 9,650 కోట్లు అందించామని, రూ. 400 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటినీ త్వరలో ఇస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ వ్యవస్థ డబుల్‌ బెడ్రూం ఇళ్ల పరిశీలనలో ఉందని చెప్పారు. రాంపల్లిలో టన్నెల్‌ ఫామ్‌ టెక్నాలజీ, దుండిగల్‌లో ప్రీ ఫ్యాబ్‌ టెక్నాలజీలను వినియోగించి ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.  

కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించి పీఎంఏవై గ్రామీణ్‌ కింద రూ. 385 కోట్లకుగాను రూ. 190 కోట్లే విడుదల చేసిందని, ఇదే పథకం అర్బన్‌ విభాగంలో రూ. 2,305 కోట్లకుగాను రూ. 1,120 కోట్లే ఇచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల మొత్తం వైశాల్యం 12 కోట్ల చదరపు అడుగులన్నారు. 75 వేల మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి, అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధమైన వారు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే ఈ పథకం కింద సాయం చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు