వేములవాడ: సామాన్య భక్తురాలిగా వచ్చి.. కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..

4 Feb, 2022 14:25 IST|Sakshi
కాంట్రాక్టర్‌ నుంచి పార్కింగ్‌ టికెట్లు స్వాధీనం చేసుకున్న ఈవో రమాదేవి

సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాల పార్కింగ్‌ పేరిట దోపిడీకి గురవుతున్న వైనంపై వచ్చిన ఫిర్యాదులపై ఈవో రమాదేవి స్పందించారు. గురువారం ఉదయం సామాన్య భక్తురాలిగా వచ్చిన ఈవో పార్కింగ్‌ టెండర్‌ కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడలో రాజన్న ఆలయ టీటీడీ ధర్మశాలల పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు రూ.30 పార్కింగ్‌ ఫీజు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్‌ రూ.100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి.

దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్‌ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్‌ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్‌లకు చెందిన పార్కింగ్‌ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు ఉచిత పార్కింగ్, నాంపల్లి గుట్టపైకి ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 
చదవండి: హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్‌

రూ.30కి బదులు రూ.100 వసూలు
వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు టీటీడీ ధర్మశాలల ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. ఇందుకు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ రూ.30 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్‌ దేవస్థానం అధికారులు ముద్రించిన రూ.30 టికెట్ల స్థానంలో రూ.100 టికెట్లు ముద్రించి అందినంత దండుకుంటున్నారు.  
టెంకాయ టెండర్‌ రద్దు
భక్తులకు ఉచితంగా టెంకాయకొట్టే నిబంధనలు అమలులో ఉండగా, రాజన్న ఆలయంలో భక్తుల నుంచి బలవంతంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఈవో గురువారం గుర్తించారు. వెంటనే సంబంధిత టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు.  
చదవండి: కరీంనగర్‌: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు

మరిన్ని వార్తలు