Vemulawada: ఏడాదిన్నర తర్వాత గర్భగుడిలోకి అనుమతి

20 Sep, 2021 10:00 IST|Sakshi

సాక్షి, వేములవాడ(కరీంనగర్‌): వేములవాడ రాజన్నకు అభిషేకాలు చేసే అవకాశాన్ని ఆలయ అధికారులకు భక్తులకు ఏడాదిన్నర తర్వాత కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఏడాదిన్నర క్రితం గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాలను నిషేధించారు. అప్పటి నుంచి అభిషేక పూజలకు భక్తులకు అవకాశం కల్పించలేదు. దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు.  ఈనెల 21 నుంచి రాజన్నకు అభిషేకాలు చేసేందుకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా ప్రభావంతో...
2020 మార్చిలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చడంతో రాజన్న గుడిని మూసివేశారు. తర్వాత తెరిచినప్పటికీ భక్తులకు సాధారణ దర్శన అవకాశమే కల్పించారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయానికి వచ్చిన ఆలయ అధికారులు రాజన్నకు అభిషేక పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆది, సోమవారాలు, ప్రత్యేక రోజుల్లో గర్భగుడి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. గర్భగుడిలో అభిషేకాల టికెట్లు రూ.600 తీసుకుంటున్నట్లు చెప్పారు. అభిషేకాల ధరలు పెంచే అంశం ఇంకా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం, ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వైరస్‌ పూర్తిగా నశించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్న బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభిషేకాలతో ఆలయంలో ఇబ్బందులు తప్పవని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా కాటుకు బలైన ఘటనలను గుర్తుకు చేసుకుంటున్నారు. 

ధర్మగుండం బంద్‌
మార్చి 16, 2020న మూతబడిన రాజన్న ధర్మగుండం ఇంకా తెరుచుకునేందుకు సమయం పట్టనుంది. ఈ నెల 21 నుంచి గర్భగుడిలోకి ప్రవేశాలు కల్పిస్తున్న అధికారులు ధర్మగుండంలో స్నానాలను మాత్రం నిషేధించారు.  

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తాం
భక్తుల విజ్ఞప్తి మేరకు రాజన్న గర్భగుడిలో అభిషేకాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 21 నుంచి అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఉన్న నిబంధనల మేరకు అభిషేకాలు కొనసాగించనున్నాం. ధర్మగుండంలో స్నానాలకు అనుమతి లేదు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తాం. భక్తులు సహకరించి నిబంధనలు పాటిస్తూ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించుకోవాలి. 

– కృష్ణప్రసాద్, ఆలయ ఈవో  

చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

మరిన్ని వార్తలు