అప్పుడే తల్లి భాషను రక్షించుకోగలం : ఉపరాష్ట్రపతి

29 Jul, 2020 15:09 IST|Sakshi

విద్యతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన రంగాల్లో  మాతృభాషా వినియోగం పెరగాలి

ప్రచార, ప్రసార మాధ్యమాలు మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి

తల్లిభాషలో చదువుతోనే సృజనాత్మకత పెరుగుతుంది

‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’వెబినార్‌లో వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌ : విద్యారంగంతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన తదితర రంగాల్లో మాతృభాష వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, కొత్త పదాల సృష్టి జరిగినపుడే తల్లిభాషను పరిరక్షించుకోగలమని  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం  తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో జరిగిన వెబినార్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన సంస్కృతి-సంప్రదాయాలకు మన అస్తిత్వానికి మాతృభాషే పట్టుకొమ్మ. మాతృభాషతోపాటు ఇతర భాషలు ఎన్నయినా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి కూడా. ఎన్ని భాషలు ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ మంచిది. అందులో తప్పేమీ లేదు. కానీ.. ఆంగ్లభాషలో విద్యాభ్యాసం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం సరికాదు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేల ఫలితాలను గమనిస్తే ఈ విషయం మనకు బాగా అవగతమవుతుంది’అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.‘అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’అన్న కాళోజీ నారాయణరావుగారి మాటను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు.


2017 వరకు నోబెల్ బహుమతి (శాంతి బహుమతి మినహా) పొందినవారిలో 90 శాతానికి పైగా మాతృభాషలో విద్యనభ్యసించే దేశాల వారేనని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణల సామర్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి ఏటా నివేదిక ఇచ్చే ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌’, ‘బ్లూమ్‌బర్గ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్’ జాబితాల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న దేశాల్లో 90 శాతానికి పైగా మాతృభాష మాధ్యమం ద్వారానే చదువుకుంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా మాతృభాషకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. పాత పదాలను పునర్వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త పదాలను సృష్టించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇందుకోసం కాశీనాథుని నాగేశ్వరరావు.. నైట్రోజన్‌ను నత్రజని అని, ఆక్సీజన్‌ను ప్రాణవాయువని, ఫొటో సింథసిస్‌ను కిరణజన్య సంయోగక్రియ అనే అద్భుతమైన పదాలను సృష్టించి తెలుగు ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాల ద్వారానే భాషతోపాటు పత్రికల మనుగడ సాధ్యమవుతుందన్నారు.

ప్రాథమిక విద్యాభ్యాసం కచ్చితంగా మాతృభాషలోనే జరగడం, ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరిగా ఒక విషయంగా ఉండటం వల్ల విద్యార్థుల్లో మాతృభాషపై ఆసక్తిని, వివిధ విషయాల గ్రహణశక్తిని పెంపొందింపజేయవచ్చన్నారు. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్) మాతృభాషలో బోధించడం వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని చెప్పిన విషయాన్ని ఉపరాష్ట్రపతి  గుర్తుచేశారు. ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న మేల్‌స్వామి అన్నాదురై కూడా.. తన మాతృభాష తమిళంలో ఇంటర్మీడియట్ వరకు చదివినందునే.. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అంశాలపైన లోతైన అవగాహన పెంచుకోవడం సాధ్యమైందన్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు.. ‘జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతటి గొప్ప మాధ్యమమో’వివరిస్తాయన్నారు. భావాన్ని వ్యక్తపరిచేందుకు భాష అవసరమని.. అందులోనూ మాతృభాషలోనైతే భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్తపరచగలమన్నారు.

వివిధ దేశాధినేతలు మన దేశానికి వచ్చినపుడు.. ఆంగ్ల భాషలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ వారి మాతృభాషలోనే సంభాషిస్తారని.. పక్కనున్న అనువాదకులు దీన్ని అనువాదం చేస్తారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా విదేశాల్లోనూ హిందీలోనే సంభాషిస్తారని.. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నేతల్లో ఒకరిగా నిలిచారని ప్రస్తావించారు. మాతృభాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమన్నారు.

‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో అంతర్జాతీయ అంతర్జాల వెబినార్‌ నిర్వహించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, తెలుగు అకాడమీలను ఉపరాష్ట్రపతి అభినందించారు. భాషాభివృద్ధికి, కొత్త పదాల సృష్టికి వర్సిటీలు వేదికగా నిలిచి మిగిలిన వారిని ప్రోత్సహించాలని సూచించారు. 
‘మాతృభాషకు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును సమన్వయం చేస్తూ.. మనల్ని విశ్వవ్యాప్తంగా నడిపించిన, నడిపిస్తున్న మాతృభాష తీరుతెన్నులను క్రోడీకరిస్తూ ప్రపంచప్రఖ్యాతి వహించగలిగిన పదసంపద, వ్యాకరణాంశాలు, వాక్యవిన్యాసం, ప్రత్యేక పదజాలం పుష్కలంగా సమృద్ధిగా ఉన్న రోజున మాతృభాషలు సాంకేతికతకు, విజ్ఞానానికి మరింత దగ్గరవుతాయి. రోజురోజుకు అంతరిస్తున్న పదాలను వెతికి పట్టుకుని సంభాషణల్లో, వ్యాసంగంలో, పాఠ్య గ్రంథాల్లలో వాటిని చేర్చి భాషను జాగృతపరచండి. ప్రతి పదం వెనుక మన సంస్కృతి ఉంటుంది. దాన్ని గుర్తించేలా విద్యార్థుల్ని తయారుచేయండి’అని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పొదిలి అప్పారావు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అధిపతి ఆచార్య అరుణ కుమారి, శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీ చైర్మన్, తెలుగు భాషాభిమాని కేఎల్ వరప్రసాద్ రెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, ఈ సదస్సు నిర్వాహకురాలు ఆచార్య డి.విజయలక్ష్మితోపాటు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న భాషాకోవిదులు, విషయ నిపుణులు, భాషాభిమానులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు