శ్రీశైలం ప్రమాదం : రాత్రంతా ప్రయత్నించాం కానీ..

23 Aug, 2020 17:52 IST|Sakshi

ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకార్‌రావు

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో చోటుచుకున్న ప్రమాదం చాలా దురదృష్టకరమని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో  ఏడుగురు ఇంజనీర్లుతో పాటు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, తాము ఎంతో చింతిస్తున్నామని అన్నారు.  సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకున్నామని, సిబ్బందిని కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. విద్యుత్‌ శాఖ మంత్రితో కలిసి ఆ రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని కానీ తమ వల్లకాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌రావు ప్రమాద వివరాలను వెల్లడించారు.

‘ప్రమాదం అనంతరం విద్యుత్‌ కేంద్రంలో కరెంట్‌ పోయింది. దీనితో లోపల అంధకారమయ్యింది. పొగతో ఆక్సిజన్ లభించలేదు. పొగను బయటకు పంపించేందుకు చాలా కష్టపడ్డాం. అయినా దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. విద్యుత్‌ కేంద్రలో ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్ ట్రిప్ కావాలి. కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదు. గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి. రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది

గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 30 చనిపోయారు. తమిళనాడులో కూడా గతంలో ఇలాంటి సంఘటన  జరిగింది. దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది దీనిపై కమిటీ వేశామ్. కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు.ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. త్వరలోనే వాళ్ళ కుటుంబాలకు జెన్కో నుంచీ సహాయం అందజేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు’అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై త్వరలోనే కమిటీ పూర్తి నివేదికను అందిస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు